ఆహారశుద్దివ్యవసాయ వాణిజ్యం

Jaggery Value Addition Products: ఆధునిక బెల్లం తయారీ, విలువ ఆధారిత బెల్లం ఉత్పత్తులు.!

1
Jaggery
Jaggery

Jaggery Value Addition Products: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే 81 లక్షల టన్నుల చెఱకులో 75% పంచదార ఉత్పత్తికి, 11.5% విత్తనం మరియు తినడానికి, 13.2% బెల్లం మరియు ఖండసారి తయారీకి ఉపయోగించబడుతున్నది. మన రాష్ట్రంలో బెల్లం పరిశ్రమ ఒక పెద్ద గ్రామీణ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందినది. ఇటీవలి కాలంలో బెల్లంతో తయారు చేసిన తీపి పదార్థాలకు గిరాకీ పెరుగుతున్నది. బెల్లం పంచదార కంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధం. దీనిలో సుక్రోజ్‌ పాటు మాంసకృతులు, కాల్షియం, ఇనుము, రాగి వంటి సూక్ష్మపోషకాలు, థైమిన్‌ కెరోటిన్‌ వంటి విటమిన్స్‌ కూడా ఉంటాయి. బెల్లం వాడకం జీర్ణశక్తిని పెంపొందిచుట, రక్తహీనతను తగ్గించుట, మూత్ర పిండాల వ్యాధిని నివారించుటకు దోహద పడుతుంది.

ఇన్ని పోషక మరియు ఔషధ గుణములు ఉన్న బెల్లం వాడకాన్ని పెంచినట్లయితే, ఇటు వినియోగదారుడికి, అటు బెల్లం రైతులకు ఎంతో లాభదాయకముగా ఉంటుంది. మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో వినియోగదారుడు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. కనుక, బెల్లంను బెల్లం రూపంలో కాకుండా బెల్లం నుండి తయారు చేసే ఇతర విలువైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి.

బెల్లం తయారీ విధానం :
రసాన్ని శుభ్రపరచుటకు, మలిన పదార్థాలను తొలగించటానికి తగినంత సున్నం కలపాలి. సున్నం మోతాదు, రసము యొక్క ఆమ్లతనుబట్టి, సున్నపు ముద్దలోని తేమనుబట్టి, నిర్ణయిస్తారు. 100 కిలోలు చెఱకు రసానికి సుమారు 56 గ్రాముల తడిసున్నపు ముద్ద కలవవలసి ఉంటుంది.

బెల్లం బాగా రంగు రావటానికి రైతులు హైడ్రోసు (సోడియం హైడ్రోజన్‌ సల్ఫేట్‌)ను విరివిగా వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఒక క్వింటాలు బెల్లంలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ 5 గ్రాములకన్నా ఎక్కువ ఉండరాదు. కాని హైడ్రోసు వాడటం వల్ల బెల్లంలో 30-40 గ్రాముల వరకు అంటే 6-8 రెట్లు ఎక్కువగా సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఉంటుంది. సరైన చెఱకు రకాన్ని ఎన్నుకొని, మంచి యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన బెల్లాన్ని పొందాలి కాని, హైడ్రోసు వాడకం ద్వారా రంగు తెప్పించి బెల్లం తయారు చేయడం శ్రేయస్కరం కాదు. పైగా హైడ్రోస్‌ వాడిన బెల్లం తొందరగా రంగుమారి, నల్లబడి, మెత్తగా తయారై నిలువ చేయుటకు పనికిరాదు. రుచి కూడా చాలా వెగటుగా ఉంటుంది.

రసం కాచుట ప్రారంభించిన తరువాత ఎంత త్వరగా దానిని మరగబెట్టి దింప గలిగితే అంత మంచిది. మొదట కొన్ని నిమిషాలు బాగా మంటవేసి, తెట్టు తేలునట్లు చేసి, అది విడుట ప్రారంభించగానే తెట్టు తీయు వరకు మంటను కొంచెం తగ్గించాలి. లేనిచో తెట్టు తిరిగి రసములో కలిసిపోయి బెల్లం నల్లబడి, నాణ్యత తగ్గుతుంది.

తెట్టు తీసిన తరువాత, బాగా మంటపెట్టి రసాన్ని పొంగునట్లు చేయాలి. ఒకవేళ పొంగిపొర్లిపోతున్నట్లు తోచినచో కొద్దిగా నువ్వుల నూనెను చిలకరించాలి.
పెనాన్ని దించబోయేముందు, పెనంలో చిక్కబడిన రసాన్ని అడుగంటకుండా చంద్రవంక తెడ్డుతో బాగా కలపాలి. పొయ్యిలోని మంటను కూడా క్రమంగా తగ్గించాలి. బెల్లాన్ని వివిధ రూపాల్లోను, పరిమాణం లోను అచ్చులుగా వేసి బెల్లం మార్కెట్కు సరఫరా చేయటం జరుగుతుంది.

కోస్తా ప్రాంతంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన బెల్లం నిల్వ ఉండదు. అంతేకాక, వినియోగదారులకు బెల్లం కావలసిన పరిమాణంలో అందుబాటులో లేకపోవటం వలన పెద్ద దిమ్మలను మార్కెట్లో కొని, చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడటం వల్ల సుమారు 10 శాతం వరకు బెల్లం వృధా అవటమేకాక, అపరిశుభ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ పరిస్థితులను నివారించటానికి రైతు స్థాయిలో బెల్లాన్ని ముక్కలు (250గ్రా. 500గ్రా., 1000గ్రా.) రూపంలో అచ్చులుగా వేయవచ్చు. ఉదాహరణకు బెల్లం అచ్చులు పోయు చట్రమును ఉపయోగించి, 98 ముక్కలను (ఒక్కొక్క ముక్క 500 గ్రా.ల చొప్పున) ఒకేసారి తయారు చేసుకోవచ్చును. బెల్లం తయారీలో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసే పెద్ద దిమ్మలుగా కాకుండా రైతులు చిన్నచిన్న ముక్కలుగా తయారు చేయడం వలన సుమారు ఎకరానికి రూ. 17,000/- వరకు అదనంగా లాభం పొందవచ్చునని పరిశోధన ఫలితాలు ఋజువు చేస్తున్నాయి. ఈ ముక్కల రూపంలో ఉన్న బెల్లాన్ని నీడలో, బాగా తేమ తగ్గేటట్లు ఆరబెట్టాలి.

బెల్లం తయారీలో అవలంభించవలసిన మంచి పద్ధతులు:

1) గానుగాడిన రసాన్ని పులిసిపోకుండా, సాధ్యమైనంత త్వరగా పెనంలో పోసి మరగబెట్టాలి.

2) రసాన్ని పెనంలో పోయడానికి ఉపయోగించే కడవలు, బెల్లం తయారీలో ఉపయోగించే పరికరాలు ఎప్పటికప్పుడు, రసం పులిసిపోకుండా ఉండుటకు కడుగుతూ ఉండాలి.

3) రసాన్ని మరగబెట్టటానికి ఉపయోగించే పెనాలు చాలా వెడల్పుగా (240-270 సెం.మీ), లోతు (45 సెం.మీ) తక్కువగా ఉండాలి. పెనం గోడలు 16 గేజీ, పెనం అడుగు భాగం 18 గేజీ కళాయి రేకుతో చేయుట మంచిది. ఈ పెనాలు కళాయి రేకుతో కాకుండా ఫుడ్డల 304 స్టెయిన్‌ లెస్‌ స్టీలుతో తయారు చేసి నట్లయితే, నాణ్యమైన బెల్లంతో పాటు మంచి రంగు గల బెల్లంను తయారు చేసుకొనవచ్చు. వెడల్పయిన మరియు లోతు తక్కువ పెనాలలో రసం బెల్లం తయారీకి వాడే పెనం త్వరగా మరగడమే కాకుండా రసమంతా ఒకే విధంగా మరిగి, రసం నుండి తయారైన బెల్లం త్వరగా చల్లారుతుంది.

4) రసమును త్వరగా మరగబెట్టుటకు అనకాపల్లి పరిశోధనా స్థానంలో రూపొందించిన అనకాపల్లి పొయ్యి వాడటం మంచిది. మాములు పొయ్యకన్నా అనకాపల్లి పొయ్యి వాడటం వల్ల సమానంగా మంట అనకాపల్లి పొయ్యి తగిలి, రసం త్వరగా మరిగి, నాణ్యమైన బెల్లాన్ని ఇవ్వటమే కాక వంట చెఱకు (10 శాతం చెఱకు పిప్పి మరియు 10 శాతం చెఱకు చెత్త) ఆదా అవుతుంది.

5) రసాన్ని శుభ్రపరచుటకు, మలిన పదార్థాలను తొలగించటానికి తగినంత సున్నం కలపాలి. సున్నం మోతాదు రసము యొక్క ఆమ్లతను బట్టి, సున్నపు ముద్దలోని తేమను బట్టి, తమ అనుభవం వలన నిర్ణయించుదురు. సున్నం తక్కువ వేస్తే బెల్లం మెత్తబడుతుంది. ఎక్కువ వేస్తే బెల్లం నల్లబడుతుంది. రుచి కూడా చెడుతుంది. సుమారు 100 కేజీలు చెరకు రసానికి సుమారు 56 గ్రాముల తడి సున్నపు ముద్ద కలపవలసి ఉంటుంది.

6) బాగా ముదిరిపోయిన చెరకుతోట నుండి బెల్లం చేసేటప్పుడు, పెనంలో గనుక చెరకు రసం విరిగినట్లనిపిస్తే తగినంత సున్నం పెట్టిన తరువాత కూడా), ఇలాంటి రసం నుండి బెల్లం తయారు చేసి దించబోయేముందు, బెల్లం (లేదా) పంచదారను సుమారు 3 కిలోలు ఒక పాకానికి (600 కేజీల రసం) కలపాలి.

మూడు పెనాల బెల్లం పొయ్యి భారతీయ చెఱకు పరిశోధనా స్థానం, లక్నో వారు మూడు పెనాల బెల్లం పొయ్యిని రూపొందించారు. ఈ పొయ్యిలో మూడు పెనాలను పెట్టుకునే అవకాశం కలదు. మూడు పొయ్యిల మీద పెట్టిన పెనాలను ఒకేసారి వేడిచెయ్యడానికి మూడు పొయ్యిలను అనుసందిస్తూ ఒక వేడి గాలి ప్రసరించే మార్గం ఉంటుంది. మూడు పెనాలు ఒక మెట్ల మార్గంలో అమర్చిబడి ఉంటాయి. మొదటి పెనం అడుగభాగాన్ని చెఱకు పిప్పిని మంటబెట్టటానికి ఒక రంధ్రం ఉంటుంది. మూడు పెనాలను ఒకేసారి చెఱకు రసంతో నింపి, మంటబెట్టడం జరుగుతుంది.

దీనివలన మొదటి పెనంలోని రసం త్వరగా వేడెక్కడంతోపాటు, రెండు, మూడు పెనాలలోని రసం కూడా కొంతవరకు వేడెక్కడం జరుగుతుంది. మొదటి పెనంలోని రసం రెండున్నర గంటల సమయంలో బెల్లం తయారీకి అనువుగా తయారవుతుంది. అదే సమయంలో రెండవ పెనంలోని రసం సుమారు 95-100 ఉష్ణోగ్రత వరకు, మూడవ పెనంలో రసం 80-85 ఉష్ణోగ్రత వరకు వేడెక్కడం జరుగుతుంది.

ఈ విధంగా జరగడం వలన మొదటి పెనంలో రసం రెండున్నర గంటల సమయంలో బెల్లంగా తయారవుతుంది. వెంటనే, బెల్లం పాకాన్ని తీసివేసి, రెండవ పెనంలో వేడిగా వున్న రసాన్ని మొదటి పెనంలోకి, మూడవ పెనంలో వేడిగావున్న రసాన్ని రెండవ పెనంలోకి మార్చి, మూడవ పెనంను అప్పుడే తీసిన చెఱకు రసంతో నింపాలి. మొదటి పాకం రెండున్నర గంటల్లో మరియు రెండు, మూడు పాకాలు సుమారు గంటన్నర నుండి రెండు గంటల సమయంలో పూర్తి అవుతుంది. ఈ మూడు పెనాల పొయ్యివలన సమయం మరియు చెఱకు చెత్త ఆదా అవుతాయి.

ఆవిరి ద్వారా బెల్లం తయారుచేసే విధానం :
సాంప్రదాయ బెల్లం తయారీలో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. పెనంను పొయ్యిమీద పెట్టి, మంట పెట్టేటప్పుడు, మంట నుండి వచ్చే బూడిద ఇతర మలిన పదార్ధాలు గాలి ద్వారా, మరుగుతున్న చెఱకురసంలో పడటంవల్ల బెల్లం రస నాణ్యత దెబ్బతిని, బెల్లం నాణ్యత చెడుతుంది. అంతే కాకుండా సమయం మరియు చెఱకు పిప్పి ఎక్కువ అవసరమవుతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, ఆవిరి ద్వారా చెఱకు రసంను మరిగించి, బెల్లం తయారీ పద్ధతిని అనకాపల్లి పరిశోధనా స్థానంలో రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో చెఱకు పిప్పి కాల్చే పొయ్యి , నీటిని ఆవిరిగా మార్చే బాయిలర్‌, బాయిలర్కు నీటిని అందించే వాటర్‌ ట్యాంక్‌, నీటిపైపులు, ఆవిరి మరియు చెఱకు రసంను మరిగించడానికి కావలసిన పెనం ఉంటాయి.

చెఱకు పిప్పిని పొయ్యిలో మంటబెడ్డటం ద్వారా, బాయిలర్లో నీరు, ఆవిరిగా మారి, పైపుల ద్వారా రసం మరిగించే పెనం అడుగుభాగానున్న పైపులలోకి చేరుతుంది. ఆవిరి నీరుగా మారేటప్పుడు వెలువడే ఉష్ణము ద్వారా రసం మరిగి బెల్లం తయారవు తుంది. దీని ద్వారా శుభ్రమైన, నాణ్యమైన బెల్లంను త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మొదటి పాకం నుండి బెల్లాన్ని రెండున్నర గంటలలోను, రెండవ పాకం నుండి రెండు గంటలు సమయంలో బెల్లం తీయవచ్చు. అంటే సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే మొదటి పాకం తయారీలో 20శాతం, రెండవపాకం తయారీలో 35శాతం వరకు సమయం ఆదా అవుతుంది. మొదటి పాకం తయారీలో 15 శాతం వరకు చెరకు పిప్పి ఆదా అయితే, రెండవ పాకంలో 40 శాతం వరకు ఆదా అవుతుంది.

Also Read: Maruteru Rice Varieties: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యంలో ఉన్న మారుటేరు వరి రకాలు.!

Jaggery Value Addition Products

Jaggery Value Addition Products

నాణ్యమైన బెల్లం తయారీ :
బెల్లాన్ని వివిధ సైజులలో తయారు చేయుటకు, స్టెయిన్లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్లు లేక చట్రములు ఉపయోగించాలి. ఈ చట్రమును చెక్కతో కూడ తయారు చేసుకోవచ్చు.

బెల్లం ముక్కలు :
అయితే బెల్లాన్ని చిన్న ముక్కల రూపంలో (25, 125, 250, 500 గ్రా., ఒక కిలో) తయారు చేసి నీడలో ఆరబెట్టడం వలన తేమ 4 నుండి 5 శాతం వరకు తగ్గి పాలిథీన్‌ సంచుల్లో ప్యాకింగ్‌ చేసినప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పాలిథీన్‌ సంచులలో ప్యాకింగ్‌ చేయుట వలన చక్కటి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పరిస్థితులలో వినియోగదారులకు కావలసిన పరిమాణంలో బెల్లాన్ని సరఫరా చేయవచ్చు.

పొడి రూపంలో బెల్లం తయారీ విధానం :
మన రాష్ట్రంలో బెల్లాన్ని వివిధ రూపాలలోను, పరిమాణంలలోను అచ్చులుగా పోసి, తయారు చేసి బెల్లం మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ పరిమాణం గల కుండలలో (ఒకటి, ఐదు మరియు 10 కిలోల బరువు గల), విశాఖపట్నం జిల్లాలో బక్కెటు రూపంలో (12 నుండి 14 కిలోలు బరువు గల), తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మరియు 10 సెం.మీ. సైజులలో చతురస్రాకారములో పలుచగా (15 నుండి 20 కిలోలు బరువు గల) మరియు చిత్తూరు జిల్లాలో ఒక కిలో బరువు గల ఉండలుగా తయారు చేసిన బెల్లం మార్కెట్లుకు వస్తుంది.

వివిధ రూపాలలో ఉన్న బెల్లాన్ని ముక్కలుగా చేసి, కిరాణా షాపుల నుండి కావలసిన పరిమాణములో వినియోగదారుడు కొనుగోలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ వాతావరణ పరిస్థితుల వలన వినియోగదారుల స్థాయిలో బెల్లం నిలువ చేయుట కష్టంతో కూడిన పని. బెల్లంలో ఉన్న గ్లూకోజు, ఫ్రక్టోజ్‌ మరియు కొన్ని రసాయనిక పదార్థాలు (ముఖ్యంగా లవణాలు, ప్రోటీన్లు) వాతావరణంలో తేమను పీల్చుకొని, చివరకు బూజు పట్టడమో, నీరు కారడమో జరిగి నాణ్యత చెడిపోతుంది. ఈ సమస్య వలన బెల్లాన్ని వేరే దేశాలకు ఎగుమతి చేయలేక పోతున్నాము.

ఈ పరిస్థితులను అధిగమించడానికి, బెల్లాన్ని పొడి రూపంలో తయారు చేసి, ఆరబెట్టి దానిలో తేమను 2 లేక 3 శాతం వరకు తగ్గించి పాలథీన్‌ సంచులలో నిల్వ చేసినపుడు 1 నుండి 2 సంవత్సరములు ఎటువంటి నాణ్యత చెడిపోకుండా నిల్వ చేసుకొని వాడుకోవచ్చును. బెల్లాన్ని పొడి రూపంలో చేసే ప్రక్రియలో ఎటువంటి రసాయనిక పదార్థాలు వినియోగించటానికి అవకాశం ఉండదు. అందువలన పొడి రూపంలో ఉన్న బెల్లాన్ని వేరే దేశాలకు సులభంగా ఎగుమతి చేసుకొనవచ్చును. బెల్లం పొడి చూడటానికి గోధుమ వర్ణంలో, పంచదారు రేణువులు ఆకారంలో ఉండి ఇంట్లో వాడుటకు అనుకూలంగా ఉంటుంది.
బెల్లం పొడిలో పంచదార కంటే ఎక్కువగా పోషకాహారపు విలువలు ఉంటాయి.

బెల్లం పొడిలో సుక్రోజు (80-85%), గ్లూకోజు, ఫ్రక్టోసు (10 నుండి 15 శాతం), మాంసకృత్తులు (0.25%), కొవ్వు పదార్థాలు (0.05), కాల్షియం (0.4%), మెగ్నీషియం (0.08%), 100 గ్రాముల బెల్లంలో 11 మి.గ్రా. ఇనుము, 8 మి.గ్రా. రాగి, 230 మైక్రో గ్రాములు నికోటిన్‌ (విటమిన్‌-ఎ), 20 మైక్రోగ్రాముల విటమిన్‌-బి, ఒక మైక్రోగ్రాము నికోటిన్‌ ఏసిడ్‌ ఉంటాయి. అదే పంచదారలో 99.9 శాతం సుక్రోజు మాత్రమే ఉంటుంది.

బెల్లం పొడి తయారీ :
బెల్లం తయారీ లాగానే మంచి బెల్లం పొడి (మంచి రవ్వకట్టు లేత బంగారపు రంగు) తయారు చేయడానికి రెండు ముఖ్యాంశాలున్నాయి. ఒకటి నాణ్యతగల బెల్లం పొడిని బాగా పక్వతకు వచ్చిన చెరకు నుండి మాత్రమే తయారు చెయ్యాలి. రెండవది రసం మరిగేటప్పుడు రంగు రావడానికి ఉపయోగించే హైడ్రోసు, వృక్ష సంబంధమైన బెండ మొక్కల గుజ్జు వంటివి కలపకూడదు. బెల్లం తయారీలో మామూలుగా కలిపే సున్నం కొద్దిగా ఎక్కువ పరిమాణంలో కలపాలి.

బెల్లం తయారీకి చెరకు గానుగాడి రసమును వెంటనే పెనంలో పోసి, రసముకు తగినంతగనాన సున్నమును రెండు లేక మూడు దఫాలుగా కలిపి మరగబెట్టాలి. రసం మరిగేటప్పుడు తెట్టును సాధ్యమైనంత వరకు పూర్తిగా తీసివేయాలి. రసం బాగా మరిగి పాకం ఉష్ణోగ్రత 10-121ళీ సెంటీగ్రేడ్‌ ఉన్నపుడు అంటే ముదకపాకం రాగానే చల్లారేటట్లు పాకాన్ని కలుపుతూ ఉండాలి. కొంత చల్లారిన తరువాత సుమారు అయిదు నుండి పది నిముషాలు కదలకుండా ఉంచితే మంచి రవ్వకట్టు ఏర్పడి, నాణ్యమైన బెల్లం పొడి తయారు చేయడానికి వీలు ఉంటుంది.

పాకం గట్టిపడే సమయంలో ఆ పాకాన్ని అల్యూమినియం లేక స్టీలుతో చేసిన ట్రేలలోకి తీసుకొని, చెక్క, తెడ్లతో త్వరగా పొడిగా చెయ్యాలి. ఒక టన్ను చెరకు నుండి 80 కిలోల బెల్లం పొడి తయారు చేయడానికి 10 నుండి 12 మంది మనుషులు తెడ్లతో సుమారు పదిహేను నిమిషాలు పని చేయాల్సి ఉంటుంది.

బెల్లం పొడి తయారు చేసిన వెంటనే దానిలోని తేమ శాతం 10-12 వరకు ఉంటుంది. పొడి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి తేమను 1 నుండి 2 శాతానికి తగ్గించుటకు ఆరుబయట ట్రేలలో లేదా పాలిహౌస్‌ డ్రైయిర్లో ఎండబెట్టుకోవాలి. ఆరుబయట ఎండలో పొడిని ఆరబెట్టుటకు, సూర్యరశ్మి బాగా ఉండే సుమారు 16 నుండి 20 గంటల సమయం పడుతుంది. అదే పాలిహౌస్‌ డ్రైయిర్‌ లో అయితే 6 నుండి 12 గంటల సమయం పడుతుంది.

బెల్లం పొడిలో ఉన్న 10-12 శాతము తేమను 1 నుండి 2 శాతానికి తగ్గించిన తరువాత 3 మిల్లీమీటర్ల జల్లెడ లేదా జల్లెడ యంత్రం ద్వారా జల్లించాలి. జల్లించిన పొడిని పాలిస్టర్‌ లేదా 400 గేజ్‌ పాలథీన్‌ సంచులలో కావలసిన పరిమాణంలో 1,2,4,10 కిలోల ప్యాక్లలలో ప్యాకింగ్‌ చేసుకోవచ్చు.

బెల్లాన్ని పొడి రూపంలో అమెరికా, ఫిలిఫిన్స్‌, కొలంబియా మరియు ఇండోనేషియా దేశాలలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందువలన మనం కూడా బెల్లం పొడిని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా బెల్లం పొడి తయారీని గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేయుటకు అవకాశము కలదు. తయారు చేసిన బెల్లం పొడిని పట్టణాలలో ఉన్న డిపార్టుమెంటల్‌ స్టోర్సులలో, కార్పొరేట్‌ షాపులలో విక్రయించుట ద్వారా బెల్లం రైతులు అధిక లాభం పొందవచ్చు.

Also Read: Cattle Fodder: వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత తయారీ.!

Leave Your Comments

Cattle Fodder: వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేత తయారీ.!

Previous article

Medicinal Plant Nela Usiri Benefits: నేల ఉసిరిలో దాగున్న నమ్మలేని ఔషధ గుణాలు!

Next article

You may also like