రోజురోజుకి కూలీల కొరత పెరుగుతుంది. కూలీల కొరతను నివారించడానికి వ్యవసాయంలో యంత్రాల వాడకం తప్పనిసరైంది. ఇప్పటికే అనేక యంత్రాలు సాగులో రైతులకు సాయపడుతుండగా, తాజాగా “జవాన్ బేలర్” అందుబాటులోకి వచ్చింది. వరిగడ్డితోపాటు జొన్న, మొక్కజొన్న చొప్పను కట్టలు కట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న పంటల సాగు భారీగా పెరిగింది. వీటి కోతల తర్వాత మిగిలే గడ్డి, చొప్ప పశువుల మేతగా ఉపయోగపడుతుంది. కానీ పొలంలోంచి వీటిని సేకరించి, కట్టలుగా కట్టడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్ద కమతాల రైతులు కూలీలను పెట్టుకొని మరీ ఈ పని చేయాల్సి వస్తుంది. అయితే కూలీల కొరత, శ్రమను తగ్గించేందుకు “జవాన్ బేలర్” యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక్కో జవాన్ బేలర్ యంత్రం తయారీ కంపెనీని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 3.50 లక్షల వరకూ పలుకుతుంది. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ కు అమర్చుకొని వాడుకోవాల్సి ఉంటుంది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలను హార్వెస్టర్లతో కోసిన తర్వాత మిగిలిన గడ్డి, చొప్పను ఈ యంత్రంతో కట్టలు కట్టవచ్చు. ఇది గంటకు 80 కట్టల దాకా కడుతుంది. ఈ కట్టలను ఎంతో తేలికగా పశువుల పాకలకు తరలించుకొని నిల్వ చేసుకోవచ్చు. భూమి, పాడి పశువులు అధికంగా ఉన్న రైతులు ఈ యంత్రాన్ని సొంతంగానే కొనుక్కోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు ఉమ్మడిగా కొనుగోలు చేస్తే ఖర్చు కలిసి వస్తుంది. కొందరు యువకులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులకు అద్దెకు ఇస్తున్నారు. ఒక్కో కట్ట కట్టేందుకు రూ. 30 నుంచి రూ. 40 దాకా తీసుకుంటున్నారు.
కూలీల కొరత, శ్రమను తగ్గించేందుకు “జవాన్ బేలర్” యంత్రం..
Leave Your Comments