వార్తలు

Muskmelon and Watermelon Crop: పుచ్చ మరియు కర్బూజా పంట లో సస్యరక్షణ

2
Watermelon
Watermelon
Muskmelon and Watermelon Crop: మన రాష్ట్రంలో పుచ్చ పంటలు 11,016 హెక్టార్లు మరియు కర్బూజాను 9,897 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలం సాధారణంగా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి అంతే కాకుండా అధిక మోతాదులో విటమిన్‌ ‘‘ఎ’’ మరియు విటమిన్‌ ‘‘సి’’ కలిగి ఉండటం వలన దాహాన్ని తీర్చే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ పంటను తొలి దశ నుండి కోతకు వచ్చే వరకూ వివిధ రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. దీనివలన దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి రైతులు సకాలంలో ఈ పంటలను ఆశించే చీడపీడలను గుర్తించి కింద సూచించిన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడిని సాధించవచ్చు.
Watermelon

Watermelon

పురుగులు
పెంకు పురుగులు: ఇవి ఆకులను, పూలను కొరికి తినడం వల్ల తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి వీటి నివారణకు రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్‌ లేదా రెండు మిల్లీలీటర్ల మలాథియాన్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకు పురుగులు: ఈ గొంగళి పురుగులు పంట యొక్క వివిధ దశలలో ఆశించి ఆకులను తింటాయి. వీటి నివారణకు రెండు మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్‌ లేదా ఒక గ్రాము థయోడికార్బును లీటరు నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి
పండు ఈగ: తల్లి ఈగలు పూత దశలో పువ్వులపై గుడ్లు పెడతాయి వాటి నుండి వచ్చిన పిల్ల పురుగులు పూత మరియు పిందెలలోకి చేరి కాయలను తిని పరుస్తాయి. వీటి నివారణకు పూత మరియు పిందె దశలో రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఎకరానికి రెండు చొప్పున పండు ఈగ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.

Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఈ పండు ఈగ నివారణకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం ఒక లీటరు నీటికి కలపాలి. ఆ మిశ్రమానికి 100 మి.లీ. మలాథియాన్‌ను కలపాలి. 10 నుండి 20 మిల్లీ లీటర్లు విషపు ఎరను మట్టి ప్రమిదలలో పోసి ఎకరం పొలంలో 6 నుండి 10 విషపు ఎర ప్రమిదలను అక్కడక్కడా పెట్టుకోవాలి.

Musk Melon

Musk Melon

నులి పురుగులు: ఈ నులి పురుగుల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 3 గ్రాముల కార్బోసల్ఫాన్‌  కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేయాలి.  మొక్క /పాదులు మొదలు దగ్గర  వేప పిండిని వేసుకోవాలి.
 తెగుళ్ళు
బూజు తెగులు: ఈ తెగులు ఆశించిన అప్పుడు మొదట్లో ఆకులమీద లేత ఆకుపచ్చ మరియు ముదురు ఆకుపచ్చ కలిపి కనిపిస్తుంది. తరువాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు అడుగుభాగాన రంగు పదార్థం ఏర్పడుతుంది. ఆకులు  పండిపోయి ఎండిపోతాయి. వర్షంతో కూడిన చల్లని వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం దీని నివారణకు 2.0 గ్రాములు మెటలాక్సిల్‌ ఎం జెడ్‌ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: ఆకుల పై భాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తరువాత చల్లని పొడి / బూడిద వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండిపోయి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా 20 రోజుల వయసున్న ఆకులను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు ఒక మిల్లీ లీటరు ట్రైడిమార్ఫ్‌ లేదా ఒక మిల్లీ లీటరు డైనోకాప్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఫ్యూజేరియం వేరు కుళ్లు / ఎండు తెగులు: తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతాయి. ఈ శిలీంద్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. కావున దీని నివారణకు ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా మూడు గ్రాములు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేల అంతా తడిచేలా పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పోయాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో వృద్ధి చేసి పాదుల మొదలు దగ్గర భూమిలో వేయాలి.

వెర్రి తెగులు: ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోతాయి. పూత పిందె ఏర్పడడం ఆగిపోతుంది దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఈ తెగులును వ్యాపించే పేనుబంక నివారణకు రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమిటాన్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పక్షి కన్ను తెగులు: ఆకులు మరియు కాయల మీద పక్షి కన్ను వంటి గుండ్రటి మచ్చలు ఏర్పడడం వలన అవి ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా ఒక గ్రామం కార్బండిజమ్‌ లేదా రెండు గ్రాముల కార్బండిజమ్‌ ప్లస్‌ మాంకోజెబ్‌ కలిపిన మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలకు గంధకం సంబంధిత పురుగు / తెగుళ్ళ మందులను వాడరాదు. వాటి వలన ఆకులు మాడిపోతాయి.

 డా.ఎం. స్వాతి శాస్త్రవేత్త (సస్యరక్షణ), డా.కె తేజేశ్వరరావు సీనియర్‌ శాస్త్రవేత్త (సస్య పోషణ)
 డా.కె. లక్ష్మణ సమన్వయకర్త ఏరువాక కేంద్రం, విజయనగరం
Leave Your Comments

Weather Alerts: మహారాష్ట్ర రైతులకు వర్షం ముప్పు

Previous article

Vitamin ‘C’: రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి

Next article

You may also like