Summer Foods: వేసవికాలం వస్తూ వస్తూనే ఎంతో ఇబ్బందిని తీసుకొస్తుంది. డీహైడ్రేషన్, తలనొప్పి, చెమట వంటి సమస్యలు ఎన్నింటినో తీసుకొస్తుంది. చల్లగా ఇబ్బంది పెట్టే చలి నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చిన ఈ ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. అన్నింటికంటే ప్రధానమైన ఈ అంశాన్ని పాటిస్తున్నామని నిర్ధారించుకున్న తర్వాత సీజనల్ ఫుడ్స్ ద్వారా ఎండ వేడి నుంచి తప్పించుకునే వీలుంటుంది. వేసవి కాలంలో ఆరోగ్యకరమైన సీజనల్ ఫుడ్ తినాలంటే ఈ కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇవి మీ శరీరాన్ని చల్లబరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందుకోసం ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
మంచి నీరు :
ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యల్లో డీహైడ్రేషన్ మొదటిది. తేమను, ఖనిజ లవణాలను అందించే నీటిని దాహంతో పనిలేకుండా వీలైంత ఎక్కువ తీసుకోవాలి. అలిసిన శరీరానికి శక్తిని అందించి చురుగ్గా ఉండేలా చేస్తుంది. సహజ సిద్ధమైన పవర్ బూస్టర్‌గా పనిచేస్తుంది. కణజాలాల్లో ఎలక్ట్రికల్ మాగ్నటిక్ ఎనర్జీలను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. శరీరం తేమగా ఉంటే చర్మం ప్రకాశవంతంగా ఉన్నట్టే. ఎందుకంటే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది. ఫలితంగా చర్మం పొడి బారుతుంది. దీన్ని నివారించాలంటే మంచి నీటిని మించిన పరిష్కారం లేదు.
మజ్జిగ :
ఈ కాలంలో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఎక్కువ, తినకూడదు అనుకుంటూనే మసాలాలూ, నూనె పదార్థాల భోజనం కానిచ్చేస్తాం. దీంతో గుండెలో మంట, అజీర్తి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటప్పుడు కొంచెం ఉప్పు వేసిన పల్చని మజ్జిగ తాగితే ఎంతో ఉపశమనం ఉంటుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. శరీరాన్ని తేమగా ఉంచడంతో పాటు, కాల్షియం, ‘బి’ విటమిన్లను అందిస్తుంది. ఫలితంగా నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. మజ్జిగ నేరుగా తీసుకోవడం కన్నా కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కూడా కలుపుకుంటే రుచితో పాటు ఫలితాలు బాగుంటాయి. జీర్ణశక్తికి తోడ్పడి శరీరం చల్లగా ఉంటుంది.
కొబ్బరి నీళ్ళు :
శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన లక్షణం కొబ్బరి నీటిలో ఉంది. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం. మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటిలోనూ అదే మాదిరి ఉంటుంది. వేసవిలో శరీరానికి కావాల్సిన ఐదు కీలక ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరము, సోడియం, ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి. శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు. శక్తి కోసం తాగే ఎనర్జీ డ్రిరక్లతో పోలిస్తే కొబ్బరిలో ఉండే పొటాషియం పదిహేను రెట్లు అధికం.
చెఱకు రసం :
వేసవి కాలం చెరకు రసం ఎక్కువగా లభ్యమవుతుంది దీనిలో ఖనిజలవణాలు అధిక పరిమాణంలో ఉంటాయి నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే శక్తి వస్తుంది. చెరకు రసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మంట వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దంతక్షయాన్ని నివారిస్తుంది. అల్ఫాహైడ్రాక్సీ వంటి యాసిడ్లు చర్మంపై యాక్నె రాకుండా చూస్తాయి. దీన్ని ఐస్ లేకుండా తాగడం మంచిది.
సబ్జా గింజలు :
సబ్జా గింజల నీటిని తాగడం వల్ల జీవ క్రియలు చురుగ్గా జరుగుతాయి. శరీర పనితీరుకి ఉపకరించే ఫ్యాటీయాసిడ్స్‌తో పాటు అధికంగా పీచును కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. అంతే కాదు మహిళలకు అవసరమైన పొలేట్, నియాసిస్, చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ‘ఇ’ తో పాటు శరీరంలో పేరుకొన్న వ్యర్థాలను ఇవి తొలిగిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. సబ్జా గింజలు యాంటీబయాటిక్స్‌గా పనిచేస్తాయి.
పుచ్చకాయ :
ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోహిణీ కార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. శరీరంలో వాటర్ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-‘‘బి’’, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్-ఏ, విటమిన్ -బి6, విటమిన్-సి, లైకోపిన్ తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంది. బిపీని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. నాడీ వ్యవస్థ పని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్దకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది. కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.
Also Read: Watermelon: పోషకాలమయం పుచ్చకాయ- ఆశించు చీడ పీడలు `సస్య రక్షణ చర్యలు.!
కర్బుజ :
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో దాగున్నాయి. అధికశాతం నీటిని కలిగి ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో తోడ్పడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
కీరదోస :
కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’ తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.
సిట్రస్ జాతి పండ్లు :
నిమ్మ, బత్తాయి, కమలా వంటి సిట్రిక్ జాతి పండ్లలో విటమిన్ సి, ఐరన్ ఉంటుంది. ఎండాకాలంలో శరీరానికి కావల్సిన శక్తినిచ్చేవి ఇవి ఎండకు, వేడికి శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటికి పోతుంది.
ద్రాక్ష :
ద్రాక్షలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ. వేసవిలో వచ్చే ఎలర్జీలు, వాపు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
అరటి, సపోటా, దానిమ్మ :
ఎండాకాలం అయితే తక్షణ శక్తి కోసం అరటిని ఆశ్రయించాల్సిందే. వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. దాహర్తిని తీర్చేందుకు సపోటా మంచి ఫలం. పోషకాలతో పాటు జీర్ణక్రియ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తూ, అందాన్ని కాపాడే పండు. దానిమ్మ. ఇందులో పీచు పదార్థాలు కూడా ఎక్కువే.
నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా ఆకుకూరలు, కూరగాయలు, కీరదోస, క్యారెట్, ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి పండు వేసవి కాలంలో దాహనికి చెక్ పెడుతుంది. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి వుండే ఈ పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుతుంది.
మసాలా, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. తాజాగా వండుకున్న ఆహారమే తినాలి. వృద్ధులకు జావ, ఉప్మా, రాగిదోశ, అటుకులు లాంటివి ఉదయం అల్పాహారం పెట్టాలి. చిప్స్, నూడుల్స్ లాంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం ఎప్పటికైనా మంచిది.
. వేసవిలో ఉల్లి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. బాడీని చల్లగా ఉంచుతుంది.
. వేసవిలో తాటి ముంజెల ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా వేసవిలోనే లభించే ఈ ముంజలు రుచిలోనే కాదు పోషకాల్లోనూ ముందే ఉంటాయి.
. కొత్తిమీర, పుదీనాలు రసం చేసుకొని తాగొచ్చు. బయట పనులు నిమిత్తం ఎండల్లో తిరిగేవారికి కూరల్లో కొత్తిమీర, పుదీనాలు ఎక్కువ మోతాదులో వేస్తే ఇవి శరీరాన్ని వడదెబ్బ నుండి కాపాడుతాయి.
. పుదీనా రసం ఇంట్లో సులువుగా చేసుకోగలిగిన మరో పానీయం పుదీనా ఆకులతో చేసే రసం. ఈ కాలంలో తగినంత నీరు అందక శరీరంలో వ్యర్థాలు పేరుకుంటాయి. పుదీనారసం తాగడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.
Also Read: Stevia: షుగర్ రోగులకు చక్కటి శుభవార్త.. చక్కర బదులు స్టీవియా!