Harvest Home Foods: ఏ పంట వేసిన కేవలం జీవనోపాధి కోసం మాత్రమే, ఏ ఆహారం తీసుకున్నా ఆరోగ్యం కోసం మాత్రమే. ఆరోగ్యమే ఆనందం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి పునాది మాత్రం రసాయన రహిత సేంద్రియ పంటలే. హరిత విప్లవం నుంచి నేటి వరకు ప్రపంచాన్ని పట్టి పీడించే రసాయన పద్ధతులపై క్రమంగా విముఖత పెరుగుతుంది. ప్రపంచమంతా నేడు సేంద్రియ జపం చేస్తోంది. సకల అనర్థాలకు మూలమైన రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉంటూ ప్రకృతి పర్యావరణ విధానాలకు ఆదరణ చూపుతున్నారు. రసాయనక సాగులో ఉన్న లోపాలను గుర్తించి ప్రకృతి బాట పట్టిన రైతులు ఎందరెందరో. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య సంక్షోభం, అనార్యోగం. కాలుష్యం అనేది నాణ్యమైన ఆహార ఉత్పత్తుల కొరత వంటి అంశాలు ఎంతో మందిని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్నాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం
జనాభా వేగంగా పెరుగుతుంది. జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు పెద్ద ఎత్తున ఆహార పంటల సాగు చేస్తున్నారు. అయినా ఒక్కసారి వరదలు, కరువు, చీడపీడల వల్ల పంట నష్టం తప్పడం లేదు. ఇలాంటి సమయంలో కూరగాయలు, ధాన్యం ధరలు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నారు. అనారోగ్యాలకి కారణమయ్యే మందుల పంటలు వద్దనుకునే వారికి పరిష్కారం మిద్దె తోట. ఇది ఇంటి పంట లోగిళ్లకి అందమే కాదు ఆరోగ్యానికి వరం కూడా. ఒకప్పుడు చిరు దివ్వెగా మొదలైన మిద్దెతోట నేడు కాంతి పుంజమై ప్రకాశిస్తోంది. నగరవాసులు అంతా ఒకర్ని చూసి మరొకరు స్ఫూర్తి పొంది మిద్దె తోటలను విస్తరింప చేస్తున్నారు.
తోట పని మాకు చేత కాదు, మావల్ల కాదన్న వారు కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. నేడు ప్రతి నగరంలో డాబా సేద్య దారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సొంతింటి పంటకు మించిన మాధుర్య వంట లేదంటే పంటలు పండిస్తున్నారు. ఇంటికి కావాల్సిన పండ్లు కూడా పండిస్తూ ఇంటి పంట రుచులు ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో వేసే మిద్దె తోటలు ఇప్పుడు పట్టణాలకు కూడా పాకాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఆకుకూరలు, పండ్లతోటలు వేస్తూ లాభాలు పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని పొందుతున్నారు.
Also Read: Kanakambaram Farmers: శ్రావణమాసంలో లాభాలు పొందుతున్న కనకాబంరం రైతులు.!
డాబాలపై సేంద్రియ సాగు
కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. పట్టణ ప్రాంతాలలో పోషక పదార్థాల నిచ్చే కూరగాయలను పెంచి అందరికి ఆదర్శం అవుతున్నారు. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాన్ని, కూరగాయల ధరలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన తాజా కూరగాయల్ని, ఆకుకూరల్ని, పండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటి దివ్యవరం. పెరటి తోటల పెంపకం… డాబా పైన సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించుకొని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని డాబాలపై సేంద్రియ సాగు ద్వారా ఇంటి అవసరాలకు సరిపడే కూరగాయలు పండించుకోవచ్చు. అంతే కాదు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే లక్షల్లో ఆర్జించవచ్చు. టెర్రస్ గార్డెన్ గురించి చాలా మందికి తెలుసు. కానీ భవనాలపై చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటిల్లిపాదికీ కావాల్సిన కూరగాయలు పండ్లు పండించుకోవచ్చు. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలతో పనిలేకుండా సేంద్రియ పద్దతిలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తీయవచ్చు. కేవలం వ్యవసాయ పొలాల్లోనే కాదు, ఖాళీ జాగాలో, ఇంటి పైకప్పు పైన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు సాగు ద్వారా ధరలను కూడా నియంత్రించవచ్చని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇంటి పైకప్పుపై కనీసం వంద చదరపు అడుగుల స్థలంలో కూడా ఏటా 300 కిలోల కూరగాయల దిగుబడి తీయవచ్చని పరిశోధనల ద్వారా తేలింది.
వ్యవసాయ భూములపై ఒత్తిడి తగ్గించాలి
పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు సాగు భూములపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. మరోవైపు పట్టణాలు వేగంగా విస్తరించడంతో సాగు భూమి తగ్గిపోతుంది. వీటికి తోడు ఎల్ నినో, లానినో ప్రభావంతో వరదలు, కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. వీటిని అధిగమించి ఆహార అవసరాలు తీర్చుకోవాలంటే పెరటి సేద్యం, మిద్దె సేద్యం తప్పనిసరి, పట్టణాల్లో, గ్రామాల్లో ఏ కొద్ది ఖాళీ స్థలం ఉన్న అందులో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకోవాలి.
ఖాళీ స్థలాలు అందుబాటులో లేకుంటే ఇంటి పై కప్పులపై కూరగాయల సాగు చేపట్టవచ్చు. విశ్రాంత ఉద్యోగులు, గృహిణులే కాదు, వారాంతంలో ఉద్వయోగులు గార్డెన్ లో పని చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు, ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించుకోవచ్చు. ఎక్కువ ఖాళీ స్థలం, ఇంటి పై కప్పు అందుబాటులో ఉంటే నెలకు కనీసం రూ.10 వేల నుంచి లక్షల్లో ఆర్జించవచ్చు.
పెరటి తోటల పెంపకానికి ఉద్యానశాఖ సన్నాహాలు
పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో లాగా అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు, రసాయనాల ప్రభావం లేని కూరగాయలను పొందవచ్చు. పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో పెరటి తోటల పెంపకానికి ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తున్నారు. కూరగాయల పెంపకం పై బడి పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు పిల్లలు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను పండించవచ్చు.
ఏడాది పొడవునా కల్తీ లేని కూరగాయలను తినవచ్చు.
రోజురోజుకు కూరగాయల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో పెరటి తోట సాగు విధానం అందరికీ అనుకూలంగా ఉంటుంది.. పెరటి తోటల పెంపకంలో ఎట్టి పరిస్థితిలోనూ విషపూరితమైన రసాయన మందులు వాడరాదు. పెంపకంలో చిన్న చిన్న పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడి తో పాటు నాణ్యమైన కూరగాయలను పొందవచ్చు.పెరటి తోటల పెంపకం వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఏడాది పొడవునా కూరగాయలు పొందవచ్చు.
కల్తీ లేని కూరగాయలను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పొందవచ్చు. అధిక పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు లభిస్తాయి..కుటుంబ సభ్యులకు, చిన్న పిల్లలకు మొక్కల పై ఆరోగ్యం పైన పోషక విలువలు కలిగిన ఆహార నియమాలపై అవగాహన పెంచవచ్చు. పెరటి మొక్కల పెంపకం వలన మానసిక ఉల్లాసమే కాక, శారీరక వ్యాయామానికి కూడా ఉపయోగపడుతుంది.
అసలు ఏం చేయాలి
సాగుచేసే పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా పశువుల ఎరువు వేసి నేలను చదును చేయాలి. తర్వాత పాదులు తీసుకుని విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. ఐదారు రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. వేడి వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎప్పటి కప్పుడు కలుపు సమస్య లేకుండా ఎండ, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. విత్తనాలు విత్తేటప్పుడు సరైన దూరం పాటించాలి.
టమాటా మొక్కలు నాటిన వెంటనే కర్రలతో లేదా స్టేకింగ్‌తో ఊతం ఏర్పాటు చేయాలి. జాతి కూరగాయలైన కాకర, బీర, సొర వంటి వాటికి పందిర్లు పాకించాలి. ఇంటి పైకప్పుపై నేరుగా మట్టి పోసి సాగు చేయడం సాధ్యం కాదు. అందుకే కుండీలు ఏర్పాటు చేసుకోవాలి. లేదా పాలిథిన్ షీట్ కవర్ వేసుకుని చిన్ని చిన్న గదులు తయారు చేసుకోవాలి.
వర్షపు నీరు, మొక్కలకు పోసిన నీడి తడి ఇంటి పైకప్పుకు చేరకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టగలిగితే షేడ్ నెట్, పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే ఏడాదంతా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు దిగుబడి తీయవచ్చు. మీ ఇంటి అవసరాలకే కాదు. మీ కాలనీ లోని అందరి అవసరాలు తీర్చవచ్చు. డబ్బు కూడా సంపాదించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో టెర్రస్ గార్డెన్ చేసే వారికి రాయితీపై పరికరాలు కూడా అందజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం టెర్రస్ పై కూరగాయల సాగు మొదలెట్టేద్దామా…
Also Read: Gulkhaira Farming: 10 వేల పెట్టుబడితో మంచి దిగుబడులను ఇస్తున్న గుల్ఖేరా.!