ఎకరంలో 10 రకాల పంటలు వేస్తున్న యువరైతు ఎర్ర అశోక్. విదేశీ పంట బ్రొకోలీ సాగులో సక్సెస్. వరికీ ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ఓ యువరైతు మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. తనకున్న ఎకరంలో పది రకాల కూరగాయలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఎర్ర అశోక్. పది రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఎకరంలో ఏడాది కిందటి వరకూ వరిని వేశాడు. ఆరు నెలలు కష్టపడితే వచ్చేది రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు మాత్రమే. దీంతో ఆ యువ రైతు కాస్త భిన్నంగా ఆలోచించి కూరగాయల సాగును ఎంచుకున్నాడు. టమాట, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాకరకాయ, మునగకాయ, బెండకాయ, బీరకాయ, ఆకుకూరలతో పాటు మంచి పోషక విలువలున్న విదేశీ పంట అయిన బ్రొకోలీని పండిస్తున్నాడు. ప్రతి రోజూ మండల కేంద్రంలోని మార్కెట్ కు తరలిస్తూ విక్రయిస్తున్నారు. అలాగే తమ కాలనీలోని వారంతా ఇంటికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసుకొని తీసుకెళ్తుంటారు. ప్రతి రోజూ రూ.1000 నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పెళ్లి తదితర శుభకార్యాలకూ హోల్ సెల్ లో అమ్ముతుంటాడు.
అధిక పోషక విలువలున్న క్యాబేజీ, కాలీఫ్లవర్ జాతికి చెందిన బ్రొకోలీని పండిస్తూ లాభాలు పొందుతున్నాడు. అమెరికా, యూరప్ దేశాల్లో ఏడాది పొడువునా సాగు చేసే బ్రొకోలీ పంటపై మన రైతులకు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తున్నది. ఎలాంటి అనుభవం లేకున్నా వేసిన మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించాడు. మూడు నెలల్లో తనకున్న పది గుంటల్లో పంట వేయగా ప్రస్తుతం చేతికి వస్తున్నది. మొత్తం 1000 మొక్కలు పెరిగాయి. ఒక్కోటి 400 గ్రాముల వరకు ఉంటుంది. హైదరాబాద్ లాంటి మార్కెట్ లలో కిలోకు రూ. 200 దాకా పలుకుతుండగా ఈయన మాత్రం ఇక్కడ కిలోకు రూ. 80 చొప్పున విక్రయిస్తున్నాడు. మొత్తం 400 కిలోల దిగుబడి అనుకున్నా.. రూ. 32 వేల వరకు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను రూ. 20 వేల వరకు లాభం ఉంటుందని రైతు అశోక్ చెబుతున్నాడు.
బ్రొకోలీ సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్న యువరైతు..

Leave Your Comments