వార్తలు

నారుమడుల పెంపకంలో మహిళా రైతులు..

0

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కుటుంబ ఆర్ధిక పరిపుష్టికి దోహదం చేస్తున్నారు. వ్యవసాయం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో అలుపెరుగక సాగుతున్నారు. ఉండవల్లిలో నారు మడుల పెంపకంలోనూ తోడ్పాటు అందిస్తున్నారు. విత్తనాలు నాటినప్పటి నుంచి నారు పెరిగే వరకు ఓపిక, సహనంతో నిరంతరం పర్యవేక్షిస్తూ అలుపెరగక పని చేస్తున్నారు. రైతు స్వతహాగా నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయల నారు పెంచాలంటే చాలా కష్టం. ఇది పెంచే క్రమంలో రోజు రోజూకూ మారే వాతావరణ పరిస్థితులతో నారు నష్టపోయే అవకాశం వుంది. ఈ క్రమంలో నారు మడుల్లో పెంచిన మొక్కలతో కూరగాయలు సాగు చేస్తూ రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఎకరా విస్తీర్ణంలో షేడ్ నెట్ నర్సరీ నిర్వహణకు రూ.10 నుంచి 12 లక్షల ఖర్చు అవుతుంది. భూమి చదును చేసి మడులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకమైన ట్రేలలో సేంద్రియ ఎరువు వేసి విత్తనాలు నాటి నారు పెంచుతారు. ఒక్కో ట్రేలో 98 విత్తనాలు నాటి నాటితే 80 నుంచి 90 వరకు మొక్కలు వస్తాయి. సేంద్రియ ఎరువును అనంతపురం, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. టమాటా, వంకాయ, మిరప, క్యాబేజీ, బంతిపూలు, కనకాంబరాలు, క్యాలీఫ్లవర్, తదితర నారును నిర్వాహకులు పెంచుతున్నారు. ఎకరా విస్తీర్ణం ఉన్న నర్సరీలో ప్రత్యేక ట్రేల ద్వారా దాదాపు 10 లక్షల నారు మొక్కలు పెరుగుతాయని తెలిపారు. రైతులు నారు కోసం కావాల్సిన విత్తనాలు అందిస్తే నర్సరీలో ఆరోగ్యకరమైన నారు పెంచి మొక్కకు రూ.10 నుంచి రూ.20 పైసలు రైతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు ఒక రోజు కూలీ ఉండి మరో రోజు పనులు దొరక్క ఇబ్బందులు పడాల్సి వచ్చేది. నర్సరీలో నారు మడులు పెంచుతుండటంతో ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబంలోని ఆరు మందికి సంవత్సరమంతా పని ఏర్పడింది. దీంతో ఆర్థికంగా కుటుంబాన్ని నెట్టుకురాగలుగుతున్నాం.
కూలీ పనులకన్నా నారు మడుల పెంపకం ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. గతంలో వ్యవసాయం చేసేటప్పుడు నాణ్యమైన నారు కోసం వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వయం ఉపాధితో రైతులకు ఆరోగ్యకమైన నారు మొక్కలను అందించగలుతున్నాం. షేడ్ నెట్ నర్సరీలో ప్రత్యేకమైన ట్రేల ద్వారా సేంద్రియ ఎరువులతో నారు పెంచుతున్నాం. వీటికి క్రిమిసంహారక మందుల వినియోగం ఉండదు. మొక్కలకు ఉదయం, సాయంత్రం నీటిని అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఫలితంగా ఆరోగ్యకరంగా లాభదాయకంగా ఉంది. మా కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ నారు పెంచుతున్నాం. ప్రతి మొక్కను రైతుకు అందించే వరకు ఎంతో శ్రద్ధతో పర్యవేక్షించాలి. దీంతో రైతులకు ఆరోగ్యకరమైన మొక్కలు అందించడమే కాకుండా మాకు ఆర్థికంగా బాగుంటుంది. నారుమడుల పెంపకంతో నెలకు రూ.10 వేల వరకు ఆదాయం పొందగలుతున్నాం అని మహిళా రైతులు చెప్తున్నారు.

Leave Your Comments

జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

గుడ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like