తమలపాకు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటిని కాదు జీవితాలనూ పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. వక్క ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది. హిందీలో “సుపారీ “ గా పిలుచుకునే వక్క కిలో 500 రూపాయలు పలుకుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వక్క ధర అమాంతం పెరిగింది. ధర పెరుగుదల దాదాపు 80 శాతం ఎగబాకింది. పాత వక్కలను కిలో రూ. 500 లకు, కొత్త స్టాక్ ను కిలో రూ. 415 కు కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తొలి దశ లాక్ డౌన్ సమయానికి పాత వక్క ధర కిలో రూ. 275, కొత్త వక్క ధర కిలో రూ. 250 ఉండేది. ఏప్రిల్ 13, 2020 న ఈ స్థాయిలో ఉన్న కిలో వక్క ధర 2021, ఫిబ్రవరి 10 నాటికి పాత వక్క కిలో రూ. 500, కొత్త వక్క కిలో రూ. 415 కు పెరిగింది.
ప్రపంచంలో వక్కను పండించే దేశాలలో భారత్ దే తొలి స్థానం.
ప్రపంచంలో లభ్యమయ్యే వక్కలో 54.07 శాతం భారత్ లో పండించిందే కావడం విశేషం. కర్ణాటక, కేరళ, అస్సాం ,రాష్ట్రాలు వక్క తోటల సాగులో ముందు వరుసలో వున్నాయి. వక్క భారత్ లో అత్యధికంగా పండుతున్నప్పటికీ ఆ వక్క నమిలే అలవాటు మాత్రం భారతీయులది కాదట. మలేషియా, వియత్నాం లో ఈ అలవాటు మొదలైందట. తెలుగు రాష్ట్రమైన ఏపిలో కూడా రైతులు ప్రయోగాత్మకంగా వక్క సాగు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వక్క తోటలను కొందరు రైతులు సాగు చేస్తుండటం విశేషం. ఒక ఎకరం పొలంలో 450 నుంచి 500 వక్క చెట్లను రైతులు నాటుతున్నారు. వక్క పంట ఐదేళ్ల తర్వాతగానీ చేతికి రాదు. ఐదేళ్ల తర్వాత నుంచి ఏటా ఒక పంట చేతికొస్తుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా 100 కేజీల వరకూ పచ్చి వక్క కాయలు వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి 30 శాతం మాత్రమే వక్క వస్తుంది.