పోషకాలు మెండు… దిగుబడి అధికం
ఎరువులు వేసేది లేదు…కల్తీ అసలే ఉండదు..
సాగుపైపు విద్యావంతుల మక్కువ
ఏపంట పండించాలన్నా సారవంతమైన నేల అవసరం.అందులో పోషకాలు వుండాలి.ఇదంతా పాత పద్ధతి.ఇక నుంచి నేల (మట్టి)అవసరంలేదు… చీడపీడల బెడదా ఉండదు.. కలుపు సమస్య కూడా ఎదురవదు.కేవలం నీరు, గాలి సహకారంతో బలవర్ధకమైన ఆకుకూరలను పండించటమే హైడ్రోఫోనిక్స్ వ్యవసాయ సాగు.ఇదే విధానంతో పోషకాలతో కూడిన తాజా ఆకుకూరలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజాంపేట కు చెందిన విద్యావంతులైన అన్నా చెల్లెల్లు.
నిజాంపేట కు చెందిన తేజ కార్తీక్ రెడ్డి,స్రవంతి రెడ్డిలు అన్నా చెల్లులు.తేజ కార్తీక్ ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తుండగా,స్రవంతి విదేశాల్లో ఉద్యోగం చేస్తుంది.వృత్తి రీత్యారెండేళ్ళ క్రితం డిల్లీకి వెళ్లిన తేజకార్తీక్ రెడ్డి అక్కడ హైడ్రోఫోనిక్స్ విధానంతో ఆకుకూరలు పండిచటం చూసి ఆకర్షితుడయ్యాడు.ఇదే విషయాన్ని తన చెల్లితో పంచుకొని మంచి లాభాలు పొందవచ్చని భావించారు. దీంతో నగర శివారు లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీఎదుట వున్నా అన్నారం గ్రామంలో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని “హైలిఫ్రెష్ “ పేరుతో ఒక ఎకరంలో హైడ్రోఫోనిక్స్ విధానంతో ఆకుకూరలు,మరో ఎకరంలో రెడ్ క్యాబేజీ,గ్రీన్ గోబీ తదితర కూరగాయలు పండిస్తున్నారు.
దేశీ,విదేశీయ ఆకుకూరల సాగు…
హైడ్రోఫోనిక్స్ విధానంలో దేశీయంగా లభించే పాలకూర,గ్రీన్ తోటకూర,కొత్తిమీర,పుదినా,గోంగూర,మెంతికూరలతో పాటు అత్యధిక పోషకాలు కలిగిన విదేశీయ రెడ్ తోటకూర,బ్రకోలి ,బటర్ హెడ్ ,పాక్చాయి,పార్శిలీ వంటివి పండిస్తున్నారు.
హైడ్రోఫోనిక్స్ విధానం అంటే…
నిర్ణీత ఉష్ణోగ్రత ఉండేలా ఓ షెడ్ ను నిర్మించి అందులో ప్రత్యేక పైపు లైను వ్యవస్ద ఏర్పాటు చేస్తారు.పైపుల పైన వున్నా రంధ్రాల్లో మొలకెత్తిన ఆకుకూరల వేర్లు నీటిలో మునిగేలా ఉంచుతారు.ఆక్సిజన్ కలిగిన ఆర్వో నీరు పైపు లైన్లలో నిత్యం సరఫరా అవుతుంది.ఈ ప్రక్రియ లో నీటితో పాటు అందులోని ఆక్సిజన్ ను వేర్ల ద్వారా గ్రహించి ఆకుకూరలు ఏపుగా పెరిగి చేతికొస్తాయి.కేవలం నీరు,ఆక్సిజన్ ద్వారానే ఆకుకూరలు సాగువుతాయి.ఇందులో ఎలాంటి రసాయన మందులు వినియోగించరు.నాటిన 20 నుంచి 35 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది.
ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికే….
ఆకుకూరలను ఆర్డర్ చేస్తే హైలీ ఫ్రెష్ నిర్వాహకులు నేరుగా ఇంటికి సరఫరా చేస్తున్నారు.ప్రస్తుతం ప్రగతి నగర్,నిజాంపేట,గండిమైసమ్మ ప్రాంతాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. నెలకు రూ.500లు మొదలుకొని రూ.1000 ల వరకు చార్జీ వసూలు చేస్తారు. రూ.500 చెల్లిస్తే నాలుగు రకాల తాజా ఆకుకూరలు నెలలో నాలుగుసార్లు ఇంటికే పంపిస్తారు.స్వచ్చమైన కూరగాయలు అందించాలనే….
నగరవాసులకు సహజ సిద్దంగా పండించినా తాజా కూరగాయలు,ఆకుకూరలు అందించాలన్న లక్ష్యం తోనే హైలీ ఫ్రెష్ ఫార్మ్ ను ఏర్పాటు చేశాం.ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతున్నాం.ఎకరంలో కూరగాయలు,మరో ఎకరంలో హైడ్రోఫోనిక్స్ విధానంతో ఆకుకూరలు సాగుచేస్తున్నాం. అత్యధిక పోషక విలువలు కలిగిన ఆకుకూరలను పండిస్తున్నాం.మార్కెట్ కంటే తక్కువ ధరలో నగరవాసులకు అందిస్తున్నాం.