వార్తలు

టమోటా రైతు నిలకడలేని ధరలతో నష్టపోకుండా టమాటాలతో ఒరుగులు, పొడులు..

0

ఒక్కొక్కసారి కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డివిరిస్తే, ఒక్కొక్కసారి తగ్గిన ధరలు అన్నదాతను రోడ్డున పడేస్తాయి. ముఖ్యంగా టమోటా రైతు నిలకడలేని ధరలతో ఏటా నష్టాలను ఎదుర్కొంటూనే ఉంటున్నాడు. అయితే టమోటా రైతులకు విజ్ఞప్తి. రేటు లేకపోతె వాటిని రోడ్డు మీద పడెయ్యడం మానేసి నిల్వ చేసే పద్ధతిని ఎంచుకోండి. నాణ్యమైన టమాటాలను కోసి ఎండబెట్టండి. ఎండిన టమోటాకి చాలా గిరాకీ ఉంది. ఇక ఒక కిలో టమోటాలతో 500 గ్రాముల పొడిని తయారు చేయవచ్చు. నిలకడ లేని ధరలతో టమోటా రైతు చిత్తవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ టమోటాల సాగు ఉన్నప్పటికీ అత్యధికంగా పండించేది రాయలసీమ జిల్లాల్లోనే. చిత్తూరు జిల్లా టమోటాల సాగుకు పెట్టింది పేరు. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం మేలు రకం టమాటా పది కిలోల ధర రూ.130 ఉంది. ఇది రూ.10 కి పడిపోయే సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతిదాకా వచ్చిన విలువైన ఆహారం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో టమాటాలు ఒరుగులుగా, పొడిగా మార్చి నిశ్చింతగా వాడుకోవచ్చని అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం సూచిస్తోంది. టమాటా ఒరుగులు, పొడులను నిల్వ ఉంచి వాడిన రుచిలో తేడా లేదని, పోషకాల నష్టం కూడా ఏమీ లేదని కేవీకే అధ్యయనంలో తేలింది.
టమాటా ఒరుగులు, పొడి తయారీకి నాణ్యమైన కాయలను ఎన్నుకోవాలి. టమాటాలను శుభ్రంగా నీటిలో కడగాలి. నాలుగు నుంచి 8 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ షీట్ మీద 34 డిగ్రీల సెల్షియస్ అంతకుమించిన ఉష్ణోగ్రత వున్నప్పుడు 7 నుంచి 10 రోజుల వరకూ ఎండబెట్టాలి. ఒరుగుల మీద మంచు పడకుండా జాగ్రత్తపడాలి. పూర్తిగా ఎండిన ఒరుగులను గాలి ప్రసరించే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటే పాడైపోకుండా ఉంటాయి. కేజీ టమాటాల నుంచి 60 గ్రాముల ఒరుగులు తయారవుతాయి. ఒరుగులను పొడి చేయవచ్చు. కేజీ టమాటాలతో 500 గ్రాముల పొడి తయారవుతుంది. నిల్వ చేసిన ఎండు ఒరుగులను 4 నుంచి 6 గంటల వరకూ నీటిలో నానబెట్టి కూరల్లో వేసుకోవచ్చు. టమాటా పొడిని నేరుగా కూరల్లో వేసుకోవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు, రెడ్డిపల్లి కేవీకే ప్రయోగాత్మకంగా కొందరు మహిళలకు టమాటా ఒరుగులు, పొడిని ఇచ్చి వాడించి చూశారు. వీటితో చేసిన వంటకాల రుచి తాజా టమాటాలు వేసినప్పటి మాదిరిగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైందని ఆరోగ్యనిపుణులు తెలిపారు. 45 రోజుల పాటు నిల్వ చేసిన టమాటా ఒరుగులు, పొడులపై వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యత నియంత్రణ కేంద్రంలో పరీక్షలు జరిపారు. దాదాపుగా తాజా టమాటాల్లో మాదిరిగానే విటమిన్ సి, లైకోపీన్ తదితర పోషక విలువలుండటం విశేషం.

Leave Your Comments

వంకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Previous article

వేసవిలో ఇంట్లో పెంచుకునే మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు..

Next article

You may also like