వార్తలు

బంతిపూల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న యువరైతు..

0

మాక్లూర్ మండల పరిధిలోని గ్రామాలకు చెందిన కొందరు రైతులు బంతిపూల తోటలను సాగుచేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతోపాటు అనుకూలంగా లేని ఎర్రమట్టి నేలల్లో ఆరుతడి పంటలు పండిస్తూనే బంతిపూల తోటలను పెంచుతూ అధిక లాభాలు పొందవచ్చనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే మండలంలోని పలు గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మాదాపూర్ గ్రామానికి చెందిన యువరైతు శ్రీనివాసరావు. కౌలుకు తీసుకున్న అర ఎకరంలోనే బంతి, షిర్డీ బంతి (గలాండా) చాందినీ పూల తోటలను పెంచి ఆర్మూర్, నిజామాబాద్, నందిపేట్ కేంద్రాల్లోని మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇష్టంతో ఏ పని చేసినా కష్టం కాదని నిరూపిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందెడ్ నుంచి గలాండా, చాందినీ, బంతి నారు తీసుకువచ్చి పూల తోటలను పెంచాడు. అర ఎకరానికి రూ. 20 వేల నారు, దుక్కి, కూలీలకు ఖర్చు చేస్తున్నాడు. నారు వేసిన అనంతరం మొక్కలు పెరిగే వరకు మాత్రమే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. నీటి పారకం ఎక్కువ మొత్తంలో ఉండక పోగా, గాలి, వర్షం, వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట ఇదొక్కటేనని తెలిపాడు. బంతి వారానికోసారి, చాందినీ రెండు వారాలకు 3 సార్లు, షిర్డీ బంతి
వారానికి రెండు సార్లు కోతకు వస్తాయని చెబుతున్నాడు. మార్కెట్లో బంతి, షిరిడి బంతి కిలోకు రూ. 30, చాందినీ కిలోకు రూ. 50 ధర పలుకుతోంది.
నల్లరేగడి నేలల్లో సైతం పూల సాగు చేయవచ్చని, నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని, వారానికోసారి నీటి పారకం చేస్తే చాలని శ్రీనివాసరావు వివరించాడు. మార్కెట్లో ధరను బట్టి రోజుకు వెయ్యికి పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు. పండుగల వేళ ఆదాయం రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఎకరాన 40 వేలు ఖర్చు చేస్తే లక్షకు పైగా ఆదాయం వస్తుందని చెప్పారు. అర ఎకరంలోనే రెండు రకాల పూలను పండిస్తూ ఆదాయం గడిస్తున్నట్లు వివరించాడు. రైతులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగుతోపాటు బంతిపూల తోటలపై ఆసక్తి కనబరిస్తే చాలా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడించవచ్చని నిరూపిస్తున్నాడు.

Leave Your Comments

దాల్చిన చెక్క తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

పంటలు సాగు చేయడంలో సరికొత్త వైవిధ్యాన్ని చాటుతున్న రైతులు..

Next article

You may also like