వేసవి కాలం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పండ్లలో మామిడి ఒకటి. ఏ పండుకు లేనన్ని జాతులతో పసందైన రుచులతో మామిడి పండ్లు నోరూరిస్తాయి. అయితే రాష్ట్రం, జిల్లాలను బట్టి మారుతూ ఉండే మామిడి జాతులన్నీ ఒక్క ప్రాంతంలో లభించటం సాధ్యం కాదు. కాని ఓ మామిడి చెట్టు విభిన్నంగా 20 జాతులకు చెందిన మామిడి పండ్లను కాస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందనే కదా మీ డౌట్.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఉద్యానవన శాఖ రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్ ఇంట్లో ఉంది. 15 ఏళ్ల క్రితం పదవి విరమణ పొందిన శ్రీనివాస్ అప్పుడే తన ఇంటి ఆవరణలో ఒక మామిడి మొక్కను నాటారు. వివిధ పనులపై పలు రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి అక్కడ దొరికే విభిన్న మామిడి జాతుల మొక్కలను సేకరించాడు. అలా తెచ్చిన మొక్కలను ఇంటి ఆవరణలో నాటాడు. అలా నాటిన మొక్కలన్నీ కలిసి పెద్ద వృక్షంగా మారాయి. 20కి పైగా జాతుల మామిడి కాయలు ఒకే చోట కాసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ఏడాది ఓ కొత్త జాతి మామిడి మొక్కను ఇంటి ఆవరణలో నాటడం ద్వారా ఈ వైవిధ్యమైన చెట్టు ఆవిర్భవించినట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు.