M.S. Swaminathan: చెన్నైలోని తారామణిలో భారత హరితవిప్లవ పితామహుడు, సుప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్సీ ఎండీ కేశవులు కూడా పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఇప్పటికే అవార్డు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని మంత్రి అన్నారు. డాక్టర్ స్వామినాథన్ లాంటి వారు యుగానికొక్కరు పుడతారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త మరణం బాధాకరం అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షలాదిమంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించి వైద్య విద్యను వదిలేసి వ్యవసాయ విద్యను ఎంచుకుని పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడు. మానవాళి జీవిస్తున్న ఈ వందేళ్లకాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమయిన శాస్త్రవేత్త స్వామి నాథన్ గారు.
Also Read: అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు విధానం.!
ఆయన సారధ్యంలో ఏర్పడిన కమీషన్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించింది. కమీషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా రైతాంగానికి అన్యాయం చేసింది. మొదటి ఫుడ్ ప్రైజ్ విజేతగా భారతదేశ ఖ్యాతిని పెంచారు. రెండు నెలల క్రితమే వారిని వ్యక్తిగతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి వస్తాను .. వార్తలు చూస్తున్నాను .. ఆరోగ్యం కుదుటపడితే వస్తాను అని చెప్పారని మంత్రి హృద్యోగానికి లోనయ్యారు. వారు తెలంగాణకు వస్తానన్న ఆసక్తి మాలో స్ఫూర్థిని నింపిందని మంత్రి తమ బాధను వ్యక్తం చేశారు.
వారి దార్శనికత ఎంతో గొప్పది ..వారు కేవలం పరిశోధకుడే కాదు ఆయన భావి తరాల అవసరాలను గుర్తెరిగి చిత్తశుద్దితో ప్రజలే కేంద్రబిందువుగా పనిచేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి శిరస్సు వచ్చి శ్రద్దాంజలి ఘటించాం. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకపోవడం దురదృష్టకరం మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!