Telangana procures 42 lakh tonnes of paddy ప్రస్తుత సీజన్‌లో తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో వరి సేకరణ స్థితిగతులపై సమీక్షించారు. 8,268 కోట్ల విలువైన 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో పొందుపరిచిన 4.5 లక్షల మంది రైతులలో సుమారు 3.75 లక్షల మంది రైతులకు చెల్లింపులు చేపట్టామని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో వరి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది సేకరణ కంటే ప్రస్తుతం 11 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించినట్లు గంగుల అన్నారు. 13 జిల్లాల్లో 1,280 కేంద్రాల్లో ప్రస్తుతం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,775 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) గోడౌన్‌లన్నీ నిండిపోయాయని, ఇప్పుడు గోడౌన్‌లను లీజుకు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తున్నందున పంట నిల్వలో సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అన్నారు. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కేంద్రం నుండి మరియు ఎఫ్‌సిఐ నుండి ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు. Telangana procures 42 lakh tonnes of paddy
సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లోని (ఎఫ్‌సీఐ) గోడౌన్‌లు ఖాళీగా లేకపోవడంతో వరి నిల్వలకు ఇబ్బంది ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం వరి ఉత్పత్తి దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని రాష్ట్ర యంత్రాంగం అంచనా వేస్తోంది. ఎఫ్‌సీఐ సకాలంలో ర్యాక్‌లు పంపకపోవడం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ఇటీవల రైతులకు రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. Telangana Paddy Procurement Updates