Telangana Farmers Monthly income పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడే వాడే రైతు. వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణుకుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న జీవితంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఆరుగాలం పండించిన పంట సురక్షితంగా చేతికొస్తుందో లేదోనన్న ఆందోళన ఒకటైతే, చేతికందిన పంటకు మద్దతు ధర లేక గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మన దేశంలో రైతు నెలకు సగటున సంపాదించే మొత్తం ఒక ప్రైవేటు ఉద్యోగి సంపాదన కంటే తక్కువే.తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే మన రైతన్న పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది.
తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో రైతు అంశం చర్చకు రాగా.. కేంద్రం విడుదల చేసిన గణాంకాలలో మన రాష్ట్ర రైతుకు ఖర్చులు పోనూ నెలకు సగటున రూ.1,697 ఆదాయమే సమకూరుతుంది. కాగా 2021-22 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన లెక్కలు చూస్తే.. తెలంగాణాలో 59.40 లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలిపింది. అయితే ఆ రైతులకు 1.54 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపింది. ఇక సగటున రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు 38.40 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ లెక్కలను పరిశీలిస్తే 64.56 శాతం మంది రైతులు సన్నకారు రైతులే. ఇక ఐదెకరాలు ఉన్న రైతులు 14.09 లక్షల మంది ( 23.69 శాతం) ఉన్నారు. పదెకరాల లోపు ఉన్నవారు 5.64 లక్షల మంది ఉన్నారు. ఇక పదెకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు 1.26 లక్షల మంది రైతులు ఉన్నారు. 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు 9 వేల మంది ఉన్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన చూస్తే సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. Telangana Farmers Monthly income
రాష్ట్ర రైతులు నెలసరి ఆదాయంలో దేశంలో 25వ స్థానంలో ఉండటం గమనార్హం. అత్యధికంగా మేఘాలయ రైతులు నెలకు రూ.29,348 పొందుతున్నారు. కాగా జాతీయ సగటు ఆదాయం రూ.10,218 గా ఉంది. మన రాష్ట్ర రైతులు పొందుతున్న నెలసరి ఆదాయం (రూ.9,403)లో పంట ఉత్పత్తుల కోసం చేస్తున్న ఖర్చే నెలకు రూ. 6,543గా ఉంది. ఇక పశువుల కోసం నెలకు రూ.1,163 వెచ్చిస్తున్నారు. ఇవి రెండూ కలిపి మొత్తం రూ.7,706 వ్యయం అవుతోంది. అంటే రైతు కుటుంబ ఖర్చులకు నెలకు మిగిలేది సరాసరి రూ.1,697 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. Farmers Monthly Income