వార్తలు

పచ్చిరొట్ట పైర్లకు భారీ సబ్సిడీ..

0

తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్ కు సంబంధించి సోయాబీన్, పచ్చిరొట్ట విత్తనాల ధరలను, సబ్సిడీని ఖరారు చేసింది. రైతులపై విత్తన కొనుగోలు భారం తగ్గించాలనే ఉద్దేశంతో సోయాబీన్, పచ్చిరొట్ట విత్తనాలకు కలిపి ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 70.34 కోట్ల సబ్సిడీని అందించనుంది. ఇందులో సోయాబీన్ విత్తనాలకు రూ. 15.69 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. సోయాబీన్ విత్తనాల ధర క్వింటాలుకు రూ. 9,650 ఉండగా ప్రభుత్వం 40.65 శాతం సబ్సిడీని ఇవ్వనున్నది. సబ్సిడీ పోగా క్వింటాలు విత్తనాలకు రైతులు రూ. 5,727 చెల్లించాల్సి ఉంటుంది. ధరల పెరుగుదలకు విత్తనాల కొరతే కారణమని అధికారులు చెప్తున్నారు. గత వానాకాలంలో భారీ వర్షాల కారణంగా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో దేశవ్యాప్తంగా విత్తనాల కొరత ఏర్పడింది.
రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజ ఎరువుల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే పచ్చిరొట్ట ఎరువుల సాగుకు అధిక పాత్రధాన్యమిస్తున్నది. ఈ వానాకాలంలో మూడు రకాల పచ్చిరొట్ట విత్తనాలకు ప్రభుత్వం ఏకంగా రూ. 54.65 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ముఖ్యంగా జీలుగ విత్తనాలకు అత్యధికంగా రూ. 41.73 కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది. జీలుగ విత్తనాల ధర క్వింటాలుకు రూ. 5,350 ఉండగా 65 శాతం సబ్సిడీ పోను రైతులకు కేవలం రూ.1,872 కే లభించనున్నాయి. అలాగే జనుము, పిల్లిపెసర విత్తనాలకు కూడా ప్రభుత్వం 65 శాతం సబ్సీడీనిస్తున్నది. ఈ మూడు రకాల పచ్చిరొట్ట పైర్ల సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధిక మొత్తంలో విత్తనాలను సిద్ధం చేసింది. ఇప్పటికే 25వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మార్కెట్లో సిద్ధంగా ఉంచింది. ఇక జనుము విత్తనాలు 25 వేల క్వింటాళ్లు, పిల్లిపెసర 4 వేల క్వింటాళ్ల విత్తనాలు అందించాలని నిర్ణయించింది. పచ్చిరొట్ట పైర్ల సాగు వల్ల భూసారం పెరగడంతో పాటు రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గనుంది.

Leave Your Comments

మామిడి వ్యర్థాలతో ఎన్నో ఉపయోగాలు..

Previous article

వ్యాధినిరోధక శక్తిని పెంచే పానీయాలు..

Next article

You may also like