నాబార్డు ఉత్తమ పురస్కారం అందుకున్న నేపథ్యంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు (Ravindhar Rao) ను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (SingiReddy Niranjan Reddy)
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్)కు నాబార్డు జాతీయస్థాయి ఉత్తమ ప్రథమ పురస్కారం, దేశవ్యాప్తంగా 353 జిల్లాస్థాయి డీసీసీబీల్లో దక్షిణ భారతదేశ స్థాయి ఉత్తమ పురస్కారానికి కరీంనగర్ డీసీసీబీ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ ఉదయం మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు (Ramulu) గారు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 33 సహకార అపెక్స్ బ్యాంకుల పనితీరును మదింపు చేసి తెలంగాణకు ప్రథమ, గుజరాత్‌కు ద్వితీయ పురస్కారాలను ప్రకటించింది. నాబార్డు 40వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేసింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలంగా ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని, సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేద్దామని, తెలంగాణ సహకార వ్యవస్థ భవిష్యత్ లో దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఅర్ సహకార వ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుబంధు సమితిలు ఏర్పాటు చేసి రైతు వేదికలను నిర్మించి రైతులను సంఘటితం చేస్తున్నారని, రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.