మనదేశంలో ఇదివరకు ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయం చక్కపెడుతున్నారు. కానీ ట్రాక్టర్ పై రోజంతా పొలం పనులు చేయాలంటే సాధ్యమైయేనా.. రోజంతా దుక్కి దున్ని, ఇతర పనులు చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకునేసరికి ఒళ్ళు హూనమవుతుంది. తండ్రితోపాటు ఇటువంటి కష్టాలను అనుభవించిన ఓ యువరైతు సాంకేతికత సహాయంతో డ్రైవర్ అవసరం లేకుండానే ట్రాక్టార్ ను నడిపేలా రిమోట్ కంట్రోలర్ ను తయారు చేసాడు. రాజస్థాన్ లోని బరన్ జిల్లాకు చెందిన యోగేష్ 19 ఏళ్ల యువకుడు బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒక రోజు తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదంటూ ఫోన్ వచ్చింది. చదువును మధ్యలో ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో 2 నెలల పాటు ట్రాక్టర్ ఎక్కి పొలం పనులు చేసిన యోగేష్ సాయంత్రానికి బాగా అలసిపోయేవాడు. ఇందుకు పరిష్కారంగా డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడవగలదా అని ఆలోచిస్తూ తనలోని ప్రతిభను బయటకు తీశాడు. తండ్రి ఇచ్చిన రూ. 2 వేలతో ఒక రిమోట్ కంట్రోలర్ ను కొని కొద్దిగా ముందుకు వెనక్కి కదిలించాడు. కొడుకుపై నమ్మకం కలిగి యోగేష్ తండ్రి ఇతర అవసరాలకు నిమిత్తం మరో రూ. 50 వేలు ఇచ్చాడు. దీంతో ట్రాక్టర్ ను నడిపించేందుకు అవసరమైన అన్ని పరికరాలను కొని ట్రాక్టర్ కు అమర్చాడు. ఇక పూర్తిగా రిమోట్ తోనే ట్రాక్టర్ ని నడుపుతున్నాడు యోగేష్. ఈ ట్రాక్టర్ తో రైతుకు ఎన్నో లాభాలు అంటున్నాడు యోగేష్. ఇంకా ఆరోగ్య సమస్యలు, డబ్బు, సమయం ఆదా అవుతుందని య తెలిపాడు. యోగేష్ తయారు చేసిన రిమోట్ కంట్రోలర్ ట్రాక్టర్ చూసి తోటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.