ప్రధాని నరేంద్ర మోదీ విజయనగరం మామిడి గురించి ప్రస్తావించారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇక్కడి ఫలరాజు విశిష్టతను తెలియజేశారు. దీంతో మన మామిడిపంట దేశవ్యాప్తంగా పరిచయం అయినట్లు అయింది. ఇక్కడ పండే సువర్ణరేఖ, బంగినపల్లి, తోతాపురి, రసాలు వంటి వాటిని తినేందుకు అందరూ ఇష్టపడతారని మోదీ తెలిపారు. రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా జిల్లాల తర్వాత అత్యధికంగా విజయనగరంలోని మామిడి సాగవుతోంది. సుమారు 30 వేల హెక్టార్లలో తోటలున్నాయి. ఇక్కడి మామిడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ సీజన్ లో జిల్లా నుంచి రోడ్డు మార్గం ద్వారా పణుకులు రకం 10 వేల టన్నుల వరకు ఢిల్లీ, కోల్ కత్తా, బ్రహ్మపుర, భువనేశ్వర్, కటక్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అయ్యాయి. కిసాన్ రైలులో సువర్ణరేఖ, బంగినపల్లి, రసాలు వంటి రకాలు ఢిల్లీకి రవాణా అయ్యాయి. ఏప్రిల్ 14 వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 కిసాన్ రైళ్ల ద్వారా ఆదర్శనగర్ కు 10 వేల టన్నులు ఎగుమతి చేయడం విశేషం. జిల్లా నుంచి సుమారు 80 శాతం పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.