ఎండలు పెరిగిపోతున్నాయి. మీరెంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలను పసిపాపల్లా కాపాడు కోవాల్సిన సమయం వచ్చేసిందన్న మాటే. ఎండ రాకముందే ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోయాలి. బియ్యం కడిగిన నీళ్లను పోస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి. మొదట్లోనే కాకుండా ఆకుల మీద కూడా కొంచెం నీటిని చిలకరించాలి. ఇలాచేస్తే ఆకులకు పట్టిన చీడ పురుగులు నశిస్తాయి. కుండీలో కలుపు మొక్కలుంటే వెంటనే తీసేయాలి. ఎండిన లేదా పండిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి. ఈ కాలంలో చీడపురుగులు, తెగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఎరువులతో వీటిని నియంత్రించాలి. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడితే మంచిది. గుప్పెడు వేపాకులు, కొన్ని వెల్లుల్లి రేకులను తీసుకుని మెత్తని పేస్టులా చేసి, నీళ్లు కలిపి వడకట్టి పిచికారీ చేస్తే చీడపురుగుల బారి నుంచి మొక్కలను కాపాడొచ్చు. అలాగే వేపనూనె, బేకింగ్ సోడా కలిపి కూడా స్ప్రే చేయొచ్చు. కుండీలో అంగుళం మేర మట్టిని తీసి వర్మీకంపోస్ట్ వేసి దాన్ని తిరిగి మట్టితో మూసి నీళ్లు పోయాలి. కుండీల్లో పేడ వేసినా మంచిదే లేదా పేడను నీళ్లలో కలిపి పలచగా చేసి వేసినా ఫలితం ఉంటుంది. కుండీలోని మొక్క మొదట్లో ఎండిన ఆకులను వేస్తే మట్టి పొడిబారకుండా తేమగా ఉంటుంది. వీటి బదులుగా పాత కాగితాలు లేదా చిన్న చిన్న రాళ్లు పేర్చినా మొక్క తేమను కోల్పోకుండా ఉంటుంది. కుండీలను దగ్గరగా పెడితే ఎండ నేరుగా పడకుండా ఉంటుంది. ఆరు బయట మొక్కలకు గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది.