డి – విటమిన్ పుష్కలంగా లభించే గోధుమ, వరి పంటలను పండించినందుకు గానూ రైతు చింతల వెంకటరెడ్డికి మేధోపరమైన హక్కు (పేటెంట్ ) లభించింది. ఆయనకు గతంలో మట్టి విధానం సాగుకుగానూ, రెండు వరి , గోధుమల్లో విటమిన్ ఎ , సి ఉండేలా పండించిన పంటలకు గానూ ఐరోపా యూనియన్ పేటెంట్లు దక్కాయి. తాజాగా వచ్చింది నాలుగోదని ఆయన చెప్పారు. ప్రస్తుతం భవనాల్లో సూర్యరశ్మి తగలకుండా జీవిస్తున్న నగరవాసులు డి – విటమిన్ లోపంతో బాధపడుతూ రోగాల పాలవుతున్నారు. ఆ విటమిన్ కోసం మందులపై ఆధారపడుతున్నారు. అలాంటి వారిలో పోషకాహార లోపాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రయోగానికి శ్రీకారం చుట్టారంట ఆయన. నగర శివారు ఆల్వాల్ లోని క్షేత్రంలో వినూత్న వ్యవసాయ పద్ధతులతో వరిపైరు సాగుచేశారు. 100 గ్రాముల బియ్యంలో 120 నుంచి 141 అంతర్జాతీయ యూనిట్ల (ఐయూ) డి – విటమిన్ ఉన్నట్టు నిర్ధారణయింది. అదే విధానంలో సాగుచేసిన 100 గ్రాముల గోధుమల్లో 1832 ఐయూ ఉన్నట్లు ప్రయోగంలో తేలింది అని వెంకటరెడ్డి చెప్పారు. నిజానికి ధాన్యం, గోధుమల్లో ఎ – విటమిన్ పెంపొందించేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టానని, డి – విటమిన్ కూడా ఉన్నట్టు తేలింది. అనూహ్య ఫలితంగా గుర్తించి పేటెంట్ కు దరఖాస్తు చేశానని ఆయన తెలిపారు.