రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. ఆరుగాలం శ్రమించి, అతివృష్టి,అనావృష్టిలను తట్టుకొని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని పంటలు పండించి; పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక గోస పడుతున్న రైతులకు ఇప్పుడు కొత్తగా వరి గోస మొదలైంది. వరి వెయ్యాలా వద్దా అంటూ తెలంగాణ రైతులు గందరగోళంలో ఉన్నారు. ఏ నాయకుడి మాటలు నమ్మాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే కొనమని చెప్తున్నాడు .. మరో రాజకీయ పార్టీ మెడలువంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ పార్టీల నాయకులు సందేశాలతో తెలంగాణాలోని రైతులు అయోమయంలో పడిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే యాసంగిలో వరి వేయకండి.. అలా వేస్తే మేము వరి ధాన్యం కొనుగోలు చేయం.. అని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ మాటలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటోంది.. అందుకే మీరు వరి వేయకండని సీఎం కేసీఆర్ అంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చెందిన నాయకుడు వరి వేయండి మేము కొనుగోలు చేపిస్తామంటూ చేసే వాగ్దానాలపై ఎవరి మాటలు నమ్మాలో రైతులకు ఆర్థం కావడం లేదు.
వానాకాలంలో పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చినా.. యాసంగిలో వేయాల్సిన పంటలపై క్లారిటీ రాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రాజకీయ పార్టీలు వారి లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రైతులు వచ్చే యాసంగిలో వరి మినహా వేరే పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి మరీ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు… కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత బండి ఎలా రాష్ట్ర ప్రభుత్వంతో వరిని కొనుగోలు చేయిస్తారో అర్ధం కానీ పరిస్థితిలో రైతులు ఉన్నారు.
రాష్ట్ర, కేంద్ర పాలకుల ఏ పార్టీ వేరయినా కావచ్చు. రైతుల విషయంలో మాత్రం వారు ఒకే మతం, ఒకే కులం, పాలకులంతా ఒకటే రక్తం, ఒకటే మాట, ఒకటే బాటగా పరిపాలిస్తారు. ప్రజాస్వామ్య ముసుగులో రైతాంగాన్ని అణగదొక్కడమే వారి ధ్యేయం లక్ష్యం, పార్టీలు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు రైతు బంధువులుగా, బాంధవులుగా వ్యవహరిస్తాయి. అధికారానికి కెక్కిన మరుక్షణం అధికారమదంతో రైతులను ఎన్నో రకాలుగా భాదిస్తాయి. అధికారం తలకెక్కి పాలకులు రైతాంగ వ్యతిరేక పాల్పడుతున్నందువల్లనే ఈనాడు దేశంలో లక్షల మంది పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఉద్యోగులు పారిశ్రామికవేత్తలూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు రాలేదు. దేశానికి తిండిగింజలు అందించే రైతన్నలూ వరుసగా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను పాలకులు కల్పించారు. గత 30 ఎళ్ళ కాలంలో 250 రూపాయలు ఉన్న ఉద్యోగి జీతం 25 వేలు అయింది. శాసనసభ్యుల జీతాలు వెయ్యి నుంచి 50వేలకు పెరిగియి. పార్లమెంటు సభ్యుల జీతాలు ఆ స్థాయిలోనే పెరిగాయి. పార్లమెంటు సభ్యుల జీతాలు ఆ స్థాయిలోనే పెరిగాయి. రైతుల ఆదాయం మాత్రం గత మూడు దశాబ్దాలుగా పదిరెట్లు కూడ పెరగలేదు. మొత్తంగా ఈ తతంగం అంతా గమనిస్తే.. రైతులతో రాజకీయాలు చేస్తూ వారి రాజకీయ లబ్ది కోసం రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు మన పాలకులు.
#Paddyprocurementissue #Telangana #FarmersConfused #agriculturelatestnews #eruvaaka #cmkcr #bandisanjay #trsvsbjp