తూర్పు కనుమలు అరకు, లంబషింగి గ్రామాల్లో పెరిగే కాఫీ పంటకు అంతులేని డిమాండ్ ఉంది. అక్కడ కనుచూపు మేరల్లో కాఫీ తోటలు కనివిందు చేస్తాయి. ఈ కాఫీ తోటల సౌదర్యం అక్కడి ఆదిమ వాసి రైతుల శ్రమ. కొన్ని వందల కుటుంబాలు ఈ తోటల సాగులో జీవిస్తున్నాయి. ఈ కాఫీ తోటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ కొండల్లో పెరిగే అరుదైన కాఫీ పంటకు అంతులేని డిమాండ్ ఉంది. కాఫీ మొక్కలకు కొత్త చిగుర్లు వస్తున్నప్పుడు గింజలకు ఎక్కువ పోషకాలు అందడం కోసం ఆకులు, కొమ్మలు విస్తరించకుండా కత్తిరిస్తారు. అలా పారేసిన ఆకులను సేకరించి, ఆ ఆకుల నుంచి గ్రీన్ టీ చెయ్యడమే నూతన ఆవిష్కరణ. దీనివల్ల ఇప్పటివరకు కాఫీ గింజలతో జీవనోపాధి పొందుతున్న గిరిజనులు ఇప్పుడు ఆకులతో కూడా అదనంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. 70% ఎండిన కాఫీ ఆకులకు అనాస పువ్వు, నిమ్మ గడ్డి, సోంపు విత్తనాల మిశ్రమాన్ని చేర్చి గ్రీన్ టీ తయారు చేస్తారు. పాలు, పంచదార వేయాల్సిన అవసరం లేకుండా తీసుకోవచ్చును. దీనిలో కెఫిన్ ఉండదు, అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అని నాచురల్ ఫార్మసీ ఇండియా ప్రతినిధి రామన్ మాదాల చెప్పారు. తేనేటి ప్రియుల అభిరుచులకు అనుగుణంగా గుడ్ టీ, కుటి, గుడ్ నైట్ టీ, రోసెల్లా టీ పేరిట మార్కెట్లలోకి వచ్చాయి.