వార్తలు

చెరకు సాగులో ఒంటి కన్ను ముచ్చె విత్తన మొక్క నాటడం వలన ఎన్నో ప్రయోజనాలు

0

చెరకు సాగులో విత్తనం నాటే ప్రక్రియ అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ దీనికంటే ఒంటి కన్ను ముచ్చె విత్తన మొక్క నాటడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం వ్యవసాయ విభాగం అధికారులు. ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ విత్తన ఉత్పత్తిలో నిమగ్నమై సరఫరా చేస్తుండగా కొంతమంది సాగుపై ఆసక్తి చూపుతూ సమయాన్ని, ఖర్చులు ఆదా చేసుకుంటున్నారు. ఉయ్యూరు, చాగంటిపాడు, పెనుగంచిప్రోలు తదితర ప్రాంతాల్లో రైతులు ఈ విత్తనం ఉత్పత్తి చేయడమే కాకుండా పెంచిన మొక్కల్ని సైతం అమ్ముతున్నారు.
విత్తన ఉత్పత్తి:
తోట నుంచి సేకరించిన గడల్ని ఒంటి కన్ను ముచ్చె ఉండే విధంగా ముక్కలుగా చేసి వాటిని పాలిథీన్ సంచుల్లో నాటి ప్లాస్టిక్ ట్రేల్లో పెంచుతారు. ఒక్కో ట్రేలో 48 మొక్కలు ఉండాలి. మొలక వచ్చిన అనంతరం గ్రేడింగ్ చేసి మంచిగా ఉన్న వాటినే వాడుతారు. 30 రోజులు ట్రేల్లో పెరిగిన మొక్కను సాగు భూమిలో నాటుతారు. పీకపురుగు నివారణకు ముందస్తుగానే ట్రేల్లో పెరిగే మొక్కలకు నివారణ మందు పిచికారీ చేస్తారు. కల్తీలేని ఒకే రకం నాటే అవకాశం ఉంటుంది. నూరు శాతం మొలక రావడంతో పాటు మంచి దుబ్బు చేసి దిగుబడి పెరుగుతుంది. పీకపురుగు నివారణ మందు, కూలి, నాట్లు, రవాణా, విత్తన తదితర ఖర్చులు తగ్గుతాయి. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు నాలుగు టన్నుల విత్తనం అవసరం కాగా.. ఈ విధానంలో టన్ను సరిపోతుంది. నాటిన పంటకు నెల రోజుల ముందుగా క్రషింగ్ పర్మిట్ వస్తుంది. ఇంతవరకు నాటని వారు ఈనెలాఖరులోగా పూర్తి చేసినా గానుగ సమయానికి పంట అందుతుంది. సమయం, శ్రమ ఆదా అవుతుంది. ఎకరాకు రూ. నాలుగైదు వేలు సాగు ఖర్చు తగ్గుతుంది. కేసీపీ సూచనలు.. లంక, మెరక భూముల్లో సాగుకు ఈ విధానం అనుకూలం. పల్లపు మాగాణుల్లో ఈ తరహాలో సాగు చేస్తే నష్టదాయకం. రైతులు వీటిని తీసుకెళ్లిన వెంటనే పొలంలో నాటుకోవాలి.

Leave Your Comments

ఆముదం సాగు – యాజమాన్య పద్ధతులు

Previous article

అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో మామిడి పండ్ల సాగు లక్షల్లో ఆదాయం

Next article

You may also like