రైతులు పండించే పంటకు తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు, లాభాలు పొందాలంటే ప్లాస్టిక్ వినియోగం ఎంతో అవసరమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. ప్రస్తుత వేసవి పరిస్థితులలో ఆయా మెట్ట పంటలకు మల్చింగ్ విధానం ఎంతో ఉపయోపడుతుందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మల్చింగ్ విధానం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మిర్చి, కూరగాయలు తదితర వాణిజ్య పంటలకు రైతులు ఆరు గాలం కష్టించి సకాలంలో పంటకు సరైన రీతిలో నీరందించక అనేక విధాలుగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. సూక్ష్మ సాగుకి తోడ్పడే బిందు, తుంపర సేద్యంతో పాటు కూరగాయలు, పండ్ల ప్యాకింగ్ సంచులకు ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యాన సేద్య విభాగాలలో కూడా ప్లాస్టిక్ ను ఉపయోగించొచ్చు.
మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని మృత్తికలతో కలిపి ఉంచడానికి ప్లాస్టిక్ షీట్ మొక్క చుట్టూ కవచంలా పనిచేస్తుంది.
మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 – 40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది.
బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా మరో 20 శాతం నీరు ఆదా అవుతుంది.
తద్వారా పంటలకు 2 – 3 నీటి తడులు ఆదా అవుతాయి.
మెట్ట ప్రాంతాలలో పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరుగక 85 శాతం వరకు కలుపు నివారణ అవుతుంది.
వర్షా కాలంలోనూ వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు.
మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పద్ధతులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
మల్చింగ్ విధానం.. పంట దిగుబడి అధికం
Leave Your Comments