Maharashtra govt files case against RGI రైతులకు భీమా చెల్లించని కారణంగా అంబానీ సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించని కారణంగా ఆ సంస్థపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. వివరాలలోకి వెళితే…
ఖరీఫ్ 2020 సీజన్‌లో 7,00,129 మంది రైతులు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ (Reliance General Insurance ) కంపెనీకి రూ. 277.65 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే 1,61,390 మంది రైతులకు మాత్రమే ప్రీమియం చెల్లించేందుకు ఆమోదించింది ఆ సంస్థ. అందులో భాగంగా 88,997 మంది రైతులకు రూ. 52.84 కోట్లు చెల్లించింది. కాగా.. 72,393 మంది రైతులకు మిగిలిన రూ. 55.10 కోట్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాల గురించి ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఆ సంస్థ పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా క్లెయిమ్ మొత్తాలను చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వును కూడా సదరు సంస్థ ఉల్లంఘించింది. ఈ మేరకు పర్భాని జిల్లాలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు కేసు నమోదు చేసింది. ( Maharashtra govt files case against Reliance General Insurance )