Govt decides to extend free ration scheme సామాన్యులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా సమయంలో పనులు లేక సామాన్యులు ఎంతో ఇబ్బంది పడ్డారు. తినడానికి తిండి లేని గడ్డు పరిస్థితుల్ని కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకమే గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం. రేషన్ కార్డు ఉన్న పేదలకు ఉచిత రేషన్ అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాగా తొలిగా ఈ స్కీమ్‌ను 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలు చేశారు. తర్వాత దీన్ని 2021 నవంబర్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి స్కీమ్ గడువు ఎక్స్టెండ్ చేశారు.
Free Ration Scheme ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కేంద్రం అమలు చేసింది. అయితే ఈ స్కీమ్ ని వచ్చే ఏడాది మార్చ్ వరకు పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ స్కీమ్ కింద దాదాపుగా 80 కోట్ల కుటుంబాలకు లభ్ది చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్‌కు ఈ బియ్యం అదనం.
అయితే ఇటీవల ఈ కార్యక్రమాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు. దీంతో ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ నేడు ఈ స్కీమ్ పై తుది నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు ఊరట అనే చెప్పాలి.