ఎంత కష్టపడినా పంట దిగుబడులు ఆశించిన మేర ఉంటాయన్న నమ్మకం లేదు. దిగుబడులు బాగున్నా గిట్టుబాటు ధర అనుమానమే. ఇలాంటి సమయంలో రైతులు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఇందులో భాగమే. వ్యవసాయ ఆధారిత లాభదాయకమైన కుటీర పరిశ్రమ ఇది. ఒక ఎకరంలో మల్బరీ సాగు చేపడితే 5 నుంచి 10 మందికి ఉపాధి లభిస్తుంది. పట్టు పరిశ్రమకు సంగారెడ్డి జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ పరిశ్రమ విస్తరణకు అధికారులు దృష్టి సారించారు. ఆసక్తి చూపే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మల్బరీ తోట నిర్వహణ, పట్టు పురుగులు పెంచే గది నిర్మాణానికి రూ. 90 వేల వరకు సహాయం అందుతుంది. కూలీల ఖర్చు కింద దీన్ని అందిస్తారు. పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మల్బరీ మొక్కలు తక్కువ ధరకే విక్రయిచనున్నారు. మల్బరీ తోట వేశాక పట్టు పురుగులు పెంచాల్సి ఉంటుంది. ఇవి పెంచేందుకు గది నిర్మణానికి, ఇతర పరికరాలకు రాయితీ కింద సహాయం అందజేస్తూ రైతులను ప్రోత్సహిస్తారు. జాబ్ కార్డు ఉన్న వారికి ఉపాధి పథకం ఆర్థిక సహాయంతో పాటు, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా రాయితీ వర్తిస్తుంది.
మల్బరీ తోట నాటేందుకు, దుక్కి దున్నేందుకు – రూ. 1300
తోటకు కాల్వలు, బోదెలు వేసేందుకు – రూ. 3,730
మొక్కలు నాటేందుకు – రూ. 3,500
తోట నిర్వహణ – రూ. 30 వేలు
పథకం వివరాల బోర్డు – 1300
పట్టు పురుగుల షెడ్ నిర్మాణం – రూ. 1.03 లక్షలు .
పట్టు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కల్గి ఉన్న వారు అర్హులు. ఐదు ఎకరాలకు మించకుండా ఉన్న రైతులకు ఉపాధి పథకం ద్వారా రాయితీ అందజేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
పట్టు పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం
Leave Your Comments