వార్తలు

వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి..

0

ఆయన ప్రభుత్వ ఉద్యోగి. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆలోచనలు, అభిరుచులు విభిన్నంగా ఉండడంతో వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నాడు. అందరిలా సాధారణ వ్యవసాయం చేయకుండా ఓ యజ్ఞంలా కొత్తదనం ఉట్టిపడేలా సాగు చేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో కలిసి పొలంలో తిరగడంతో వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. తన 28 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాడు. శాస్త్రవేత్తలు నూతనంగా కనిపెట్టిన వంగడాలతో అత్యధిక దిగుబడి సాధించి అందరినీ అబ్బురపరిచారు. మిగిలిన 12 ఎకరాల్లో మామిడి సాగు చేశాడు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన మామిడి పండ్ల రకాల మొక్కలను సాగు చేసాడు. మామిడి తోటకు 13 ఏండ్లుగా డ్రిప్ ద్వారా నీటిని అందించటంతోపాటుగా సమయానికి ఎరువులు అందిస్తూ పంటలకు తెగుళ్లు రాకుండా చర్యలు తీసుకోవడంతో దిగుబడి బాగుందని తెలిపారు. ఈ ఏడాది దాదాపు 80 క్వింటాళ్ల మామిడి పండ్లు కాయడంతో మంచి ఆదాయం సమకూరనున్నట్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసే వ్యవసాయంలో వైవిధ్యం ఉంటుంది. అందరిలా కాకుండా వినూత్నంగా చేయడం ఆయన ప్రత్యేకత. తన మామిడి క్షేత్రంలో ఏకంగా 18 రకాల మామిడి చెట్లను సాగు చేశారు. బొబ్బిలి పునాస, బెనీసా (బంగినపల్లి), మల్లిక రకం, దశేరి, నీలం, చిన్నరసం, తెల్లగులాబీ, పెద్దరసాలు, అమ్రపాలి, తోతాపురి, హిమాయత్, కేసరి, జలాల్, వానరాజా, మంజీరా, మైమూదా, ఫజిలి ఇలా పలు రకాల చెట్లను సాగు చేశారు. ,మామిడి చెట్లకు ఈదురుగాలుల నుంచి పూత, కాయలు రాలిపోకుండా ఉండేందుకుగానూ పొలం నలువైపులా టేకు, కొబ్బరి, ఇతర చెట్లను సాగు చేశారు. వీటి ద్వారా ఈదురుగాలులకు భారీ వర్షాలకు తక్కువ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఒక్కో చెట్టుకు గెలల కొద్దీ, వందకుపైగా ఒక్కో కాయ సుమారుగా 800 గ్రాముల నుంచి 1000 గ్రాములకు పైబడి ఉండడం ప్రత్యేకత. ముఖ్యంగా ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన పండ్లను ఒకే క్షేత్రంలో సాగుచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చూసిన ప్రతి రైతూ చెబుతున్నాడు.
రఘుపతిపేట గ్రామంలోని అనంత లక్ష్మారెడ్డి కృషివనాన్ని సందర్శించిన ప్రతిఒక్కరూ ప్రవీణ్ రెడ్డిని అభినందించక మానరు. తన వ్యవసాయక్షేత్రంలో పంటలు పండించినా, తోటలను సాగుచేసినా వైవిధ్యమే. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రతిసారి శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పంట దిగుబడిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా పంట దిగుబడి, పంట సాగుపై తోటి రైతులకు మెళకువలు చెబుతుండడంతో ఆయన క్షేత్రాన్ని పరిసర గ్రామాల రైతులు సందర్శిస్తుంటారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి పీజీలో వృక్షశాస్త్రం చదవడంతో వ్యవసాయంలో శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలను సాగుచేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. కృషివనాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు ఇది మరో పరిశోధనా కేంద్రంలా ఉందంటూ కితాబునిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో వ్యవసాయక్షేత్రంలో తన సమయాన్ని కేటాయిస్తూ పంట దిగుబడికి మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 12 ఎకరాల మామిడితోటలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన మామిడి తోటను సాగు చేయడంపై ఆయనను పలువురు అభినందిస్తూ ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Leave Your Comments

మునగాకు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు..

Next article

You may also like