వార్తలు

జెర్బరా పూల సాగు.. ఎంతో లాభం

0

జెర్బరా పూలంటే మనందరికి సరిగ్గా తెలియకపోవచ్చు. కానీ చూస్తే మాత్రం గుర్తు పడతాం. వీటిని వివాహాలు, పుట్టిన రోజులు, తదితర శుభకార్యాల్లో స్టేజీలు, ఇతరత్రా అలంకరణకు ఉపయోగిస్తారు. దశాబ్దాల కిందట మహారాష్ట్ర, కర్ణాటక, పూణే, ముంబై ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఈ పూలను సాగు చేస్తూ ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణనిస్తుంది. అధికారుల శిక్షణ తీసుకుని ప్రస్తుతం మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ పంటల సాగుకు అవసరమైన సమయంలో సబ్సీడీ సైతం కల్పిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అధికారులు 500 స్క్వేర్ మీటర్ల వెడల్పు లో పూలను సాగుచేస్తున్నారు. మీటర్ కు 6 మొక్కల చొప్పున 2400 మొక్కలను పెంచగా విరివిగా పూయడం ప్రారంభమైంది. ఇక్కడ పండించిన పూలను ఒక్కొక్కటి రూ.3 ల చొప్పున విక్రయిస్తున్నారు.
జెర్బరా పూల సాగు సులభతరంగా ఉంటుంది. ఈ పూల మొక్కలకు విత్తనాలుండవు. మహారాష్ట్ర, బెంగుళూరు ప్రాంతంలో ఈ మొక్కలను టిష్యుకల్చర్ విధానంతో ప్రవర్థనం చేస్తారు. అక్కడి నుంచి మొక్కలను కొనుగోలు చేసి తీసుకొస్తారు. ఈ మొక్కలను పాలీ హౌజ్ లలో మాత్రమే సాగు చేయాలి. ఒక్కో మొక్కకు రూ. 25 నుంచి రూ.35 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో 24 వేల మొక్కలను సాగు చేయవచ్చు. ఈ పూలు ప్రస్తుతం రూ.3 విక్రయిస్తుండగా వివాహాలు, శుభకార్యాలు జరిగే కాలంలో అయితే రూ.5 నుంచి రూ.8 వరకు విక్రయించొచ్చు. నాటిన మొక్క మూడు సంవత్సరాల వరకు పంటనిస్తుంది.
జెర్బరా పూల సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం. ఈ పంటను వేసిన అనంతరం గులాబీ, కార్నివాల్ పంటలు సైతం అదే పాలీ హౌజ్ లో వేసుకోవచ్చు.

Leave Your Comments

ఫ్యాషన్ ఫ్రూట్ సాగు విధానం..

Previous article

ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like