రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మార్కెటింగ్ ఒకటని, రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం చేరవేస్తే నష్టాలను అధిగమించగలరని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు పి. సుధాకర్ అన్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం నిర్వహించిన మార్కెట్ భాగస్వాముల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి. రవీంద్రనాథ రెడ్డి, పలువురు ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు, వర్తక సంఘాల నేతలు పాల్గొని ముందస్తు ధరల అంచనాలపై చర్చించారు.
ప్రారంభోత్సవ సమావేశంలో ముఖ్యఅతిథి పి. సుధాకర్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటల్లో 30 శాతం పంట ఉత్పత్తుల్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రఘునాధ రెడ్డి మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలు, విస్తీర్ణం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు, నిల్వకు వున్న అవకాశాలు, ప్రస్తుతం ధరలను అంచనా వేస్తున్న విధానాల గురించి ఆయన వివరించారు. విశ్రాంత వ్యవసాయ ఆర్ధిక నిపుణులు రఘురామ్ ధరల అంచనా కోసం అవలంభిస్తున్న శాస్త్రీయ విధానాలు గురించి ఆయన తెలిపారు. పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెటింగ్ సేవలపై దృష్టి సారించడం శుభ పరిణామమన్నారు.
రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం అవసరం..

Leave Your Comments