కొందరు పని చేస్తున్నంతసేపూ పాటలు వింటూనే ఉంటారు. అదే మాదిరిగా ఆ ఆవులు సంగీతం వింటూ పాలిస్తాయి. జయపురానికి చెందిన ముగ్గురు యువకులు గుప్తేశ్వర్ శత్పథి, రాజీవ్ పట్నాయక్, బసంతమాహారణా కలిసి “స్వచ్ఛమైన ఆనందం “పేరుతో పాల కేంద్రం ఏర్పాటు చేశారు. గుప్తేశ్వర్ ఓ ప్రముఖ కార్పొరేటు సంస్థలో పనిచేస్తూ జీతం అందుకునేవాడు. రాజీవ్ దుబాయిలో మెరైన్ అధికారిగా, బసంత బెంగుళూరులోని ఓ పెద్ద సంస్థలో ఆర్ధిక నిపుణులుగా విధులు నిర్వహించేవారు. మంచి జీతం, మెరుగైన జీవితం.. కానీ ఏదో తెలియని వెలితి. స్వగ్రామంలో ఏదైనా చేయాలని భావించి ముగ్గురూ మాట్లాడుకొని 2017 లో విధులకు రాజీనామా చేసి జయపురం వచ్చేశారు.
అనువైన వ్యాపారం కోసం 3 నెలల పాటు సర్వే చేశారు. ఆ సమయంలో తెలిసిన ఓ విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. జయపురం నగరంలో రోజుకు 10వేల లీటర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆ పాలలోనూ కల్తీ శాతం ఎక్కువగా ఉందని గ్రహించి పాల కేంద్రం నిర్వహణపై దృష్టి సారించారు. జయపురంలో స్వచ్ఛమైన ఆనందం పేరుతో 40 ఆవులతో డెయిరీ కేంద్రం ప్రారంభించారు. కేంద్రంలో గోవులకు మ్యూజిక్ థెరపీ అందిస్తూ సాధారణం కంటే అతి సులభంగా అధిక ఉత్పత్తి సాధిస్తున్నారు. పాలతోపాటు పాల ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఏ విధమైన కల్తీ లేకుండా వినియోగదారులకు పాలు అందించడమే లక్ష్యంగా వ్యాపారం ప్రారంభిచినట్లు గుప్తేశ్వర్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో అధికశాతం పాడి పరిశ్రమ పై ఆధారపడి ఉన్నారని, వారందరితో కలిసి నాణ్యమైన పాలు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించారని అన్నారు. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జయపురం నగరంలో 500 మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. జయపురంలో ఉన్న ఈ కేంద్రం యువతకు ఆదర్శంగా మారింది. ఇక్కడ గోవుల సంరక్షణ, వాటి ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతోపాటు పాల కేంద్రం నిర్వహణపై ఉచితంగా పలువురు రైతులకు శిక్షణ అందిస్తున్నట్లు గుప్తేశ్వర్ తెలిపారు.
స్వచ్ఛమైన ఆనందం పేరుతో పాల కేంద్రం ఏర్పాటు..
Leave Your Comments