వానాకాలంలో వరి ఎక్కువగా సాగు చేసి ఉండడం & వరి కొనుగోలులో ఇబ్బందులు తలెత్తడంతో, ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్న్యాయంగా వీలైనంత మేరకు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. దీనివల్ల పంట వైవిధ్యం జరగడమే కాక రైతులకు మంచి దిగుబడి వస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది.
యాసంగిలో నీటి సౌకర్యం ఉన్న భూముల్లో వరి పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరుల సౌకర్యాలు పెరగడం వలన వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు వానాకాలం యాసంగి రెండు కాలాలలో వరి పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరి సాగు విస్తీర్ణం 2014-15లో 34.92 లక్షల ఎకరాల నుండి 2020-21 నాటికి కోటి 6 లక్షల ఎకరాలకు చేరింది. వానాకాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేసి ఉండటం, వరి కోనుగోలుకు మార్కెట్ ఇబ్బందులు తలెత్తడంతో రైతులపై ఒత్తిడి కలుగుతోంది.
వరి తర్వాత వరి పండించడం వలన పంటల వైవిధ్యం కుడా దెబ్బతింటోంది. పంట వైవిధ్యీకరణని అనుసరించడం వలన పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు రావటంతో పాటు, పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుంది. రాష్ట్రంలో పప్పు దినుసులు, నూనెగింజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. అందువలన వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనె గింజ పంటలను సాగు చేయాల్సి న అవసరం ఉంది. మార్కెట్లో ఎదురువుతున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో దీర్ఘకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినియోగించడంలో భాగంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులని కోరుతుంది.
#paddyinYasangi #elanganaAgriculture #TelanganaPaddy #AgriculturalUpdates #Eruvaaka