తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట పండించాలంటే సేంద్రియ సాగు మేలనినమ్మారు ప్రమోద్ రెడ్డి అనే రైతు. జైనథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన ప్రమోద్ రెడ్డి తన పంట చేస్తూనే ప్రయోగశాలగా మలుచుకున్నారు. ఆయన చేసిన కృషి రెండేళ్లకు ఫలించింది. ఇప్పుడు వినియోగదారులు ఆయన పంటను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా నేరుగా సేంద్రియ ఎరువును మొక్కలకు పంపి వృథాను అరికట్టి విజయం సాధించారు. దేశీయ సంతతికి చెందిన గోవు మూత్రం, పేడ ఆధారంతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. వంద కిలోల ఆవు పేడ , కిలో శనగపిండి, కిలో బెల్లంతో ఘన జీవామృతం, 200 లీటర్ల నీరు, పది లీటర్ల గోవు మూత్రం, పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, కిలో శనగ పిండి, పిడికెడు పుట్టమన్నుతో ద్రవజీవామృతం, విత్తనాల శుద్ధి కోసం బీజామృతం, రసం పీల్చే పురుగుల నివారణకు నీమాస్త్రం, ఆకుతినే పురుగుల నివారణకు బ్రహ్మాస్త్రం, శనగ పచ్చపురుగు, కాయతొలుచు పురుగుల నివారణకు అగ్ని అస్త్రం తయారు చేసి వినియోగిస్తున్నారు. పురుగుమందులు కొనుగోలు చేసేది లేకపోడంతో ఏ పంట సాగు చేసినా ఎకరానికి పెట్టుబడి రూ.3 వేలకు మించదు. పంటను బట్టి ఆదాయం రూ.50 వేల నుంచి లక్ష వరకు పొందుతున్నట్లు తెలిపారు.
వెల్లుల్లి, శనగలు, మినుములు, ధనియాలతో పాటు 8 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. గో ఆధారిత వ్యసాయానికి ఆధునిక పరిజ్ఞానం జోడించారు. ట్యాంకులు ఏర్పాటు చేసి, మొక్కలకు డ్రిప్ ద్వారా ద్రవజీవామృతం అందే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
డ్రిప్ ద్వారా నేరుగా సేంద్రియ ఎరువును మొక్కలకు పంపిణీ..

Leave Your Comments