వార్తలు

కృత్రిమ కాంతితో అన్ సీజన్ లో చామంతి పూల సాగు..

0

రైతులు మార్కెట్ లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్ సీజన్ లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్ సీజన్ లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్పలితాలు సాధిస్తుండటం విశేషం. సాధారణంగా జూన్ – జూలై నుంచి చామంతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే రైతులందరూ ఈ సీజన్ లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్ లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శశికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు.
శశికళాధరప్ప ఎంసీఏ పూర్తి చేసి 2020 – 2021 లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్ లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. రూ. 20 వేలు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్ ఇ డీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూత మాదిరిగా వెలుతురూ పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్ సీజన్ లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు.
శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూమొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చే అందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి / చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా – 1, పార్ములా – 2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్క కోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్ సీజన్ లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ. 2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు.

Leave Your Comments

వేసవిలో పంట పొలాల యాజమాన్యం..

Previous article

మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎర..

Next article

You may also like