తెలంగాణ రాష్ట్రంలో అధిక సాగు భూముల్లో ఎక్కువగా భాస్వరం ఉన్నదని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. జగదీశ్వర్ తెలిపారు. రైతులు మూసపద్ధతుల్లో భాస్వరం వంటి ఎరువులు వాడటం వల్ల పంటలకు నష్టమే వాటిల్లుతున్నదని హెచ్చరించారు. వ్యవసాయ వర్శిటీ ఆధ్వర్యంలో ఇటీవల 6 వేల మట్టి నమూనాలను పరీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 53 శాతం నేలల్లో లభ్య భాస్వరం అధికంగా ఉన్నట్లు తేలిందని డా. జగదీశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు చెందిన 207 మండలాల్లోని 54 మండలాల్లో అధికంగా, 153 మండలాల్లోని పలు గ్రామాల్లో అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు సాగుభూమిలోని మట్టి నమూనాల ఆధారంగా ఎరువులు వాడాలని ఆయన సూచించారు. కొన్ని చోట్ల భాస్వరం తక్కువగా ఉన్నట్లయితే దానిని కరిగించే జీవన ఎరువులను రెండు, మూడేండ్లపాటు క్రమం తప్పక వాడితే ఫలితాలు ఉంటాయని చెప్పారు. అధిక లభ్య భాస్వరమున్న నేలల్లో ప్రస్తుతం వాడుతున్న ఎరువుల కన్నా 25 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఇది పంటల దిగుబడి మీద ఎటువంటి ప్రభావం చూపదని ఆయన వెల్లడించారు.