Congress Vari Deeksha Live తెలంగాణలో యాసంగి పంట కొనుగోలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ వరి దీక్షకు పూనుకుంది. రైతులు నెలరోజుల నుంచి ధాన్యం అమ్ముడుపోక కల్లాల్లోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరుగు పేరుతో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు రేవంత్. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. నెల రోజులుగా రైతు ఇంటికి పోకుండా కల్లంలో కన్నీరు పెడుతున్నాడు. తక్షణం ధాన్యం కొనాలి. తరుగు పేరుతో శ్రమ దోపిడీ ఆగాలని అన్నారు.
ధాన్యం కొనుగోలుపై సీఎం కెసిఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలి అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు రాజయ్య గుండె ఆగి వరికుప్పపైనే ప్రాణాలు వదిలాడన్నారు. అయినా బండరాయి లాంటి కేసీఆర్ గుండెకు చలనం లేదా అంటూ ఎండగట్టారు. వరి, మొక్కజొన్న సహా యాసంగి పంటల సేకరణకు సీఎం కేసీఆర్ రూ.5 వేల కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ రైతుల మీద ప్రేమ ఒలకబోసే విధానాలన్నీ రాజకీయ లబ్ది కోసమేనన్నారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తానని చెప్పి ఢిల్లీ వెళ్లి మెడలు వంచుకుని వచ్చావు అంటూ ఎద్దేవా చేశారు రేవంత్. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యపు రాశులతో కల్లాలు నిండిపోయాయని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే యుద్ధం తప్పదంటున్న భట్టి విక్రమార్క హెచ్చరించారు.
రైతుల చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనాల్సిందేనన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శనివారం కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, విహెచ్, మరియు పార్టీ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అలాగే ఈ వరి దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు. Vari Deeksha Live