Edible Oil Price: ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో 6 రాష్ట్రాలు మినహా దేశం మొత్తంలో ఎడిబుల్ ఆయిల్ మరియు ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ స్టాక్ పరిమితిని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశానుసారం స్టాక్‌పై విధించిన ఈ పరిమితి జూన్ 30, 2022 వరకు కొనసాగుతుంది. గతేడాది వంటనూనె, నూనె గింజల ధరలు భారీగా పెరిగాయి. ఇది సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఈ తరహా చర్యలు తీసుకుంటోంది.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి. కాగా జూన్ 30, 2022 వరకు కొనసాగనున్నాయి. రిటైలర్లు 30 క్వింటాళ్ల కంటే ఎక్కువ ఎడిబుల్ ఆయిల్ మరియు 100 క్వింటాళ్ల వంట నూనె గింజలను నిల్వ చేయకూడదు. అదే సమయంలో టోకు వ్యాపారులకు 500 క్వింటాళ్ల ఎడిబుల్ ఆయిల్ మరియు 2000 క్వింటాళ్ల వంట నూనె గింజల స్టాక్ పరిమితిని నిర్ణయించారు. రిటైల్ వ్యాపారాలు తమ దుకాణాలలో 30 క్వింటాళ్ల వరకు మరియు డిపోలలో 1000 క్వింటాళ్ల వరకు ఎడిబుల్ ఆయిల్‌ను నిల్వ చేసుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్, బీహార్ సహా 6 రాష్ట్రాలకు మినహాయింపు:
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. స్టాక్ పరిమితికి మించి ఇక్కడ నిల్వ చేయవచ్చు. అయితే వారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన స్టాక్ పరిమితిని అనుసరించాల్సి ఉంటుంది. మినహాయింపు పొందిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ మరియు బీహార్ ఉన్నాయి.
గతేడాది దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆవనూనె అత్యధిక ధర పెరిగింది. ఆ తర్వాత ఆవాలు నూనెలో కలపడాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ధరలు మరింత పెరిగాయి. అయితే పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పలు చర్యలు చేపట్టగా వాటి ప్రయోజనాలు సామాన్యులకు అందుతున్నాయి. మళ్లీ ధర పెరగకుండా ప్రభుత్వం స్టాక్ పరిమితిని మరోసారి ఖరారు చేసింది.