ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే యువరైతు పెబ్బేరుకు చెందిన బున్యాదిపురం శివారులో 17 ఎకరాల్లో తలకంటి ఫామ్స్ పేరిట వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తిగా గో ఆధారిత, సేంద్రియ ఎరువులతో ప్రకృతి సిద్ధంగా పంట ఉత్పత్తులు పండిస్తున్నాడు. ఇందులో 8 ఎకరాల్లో మామిడి తోట నిర్వహిస్తున్నాడు. బంగినపల్లి, కేసరి, సువర్ణ రేఖ,హిమాయత్, రసాలు వంటి రకాల పండ్లను పూర్తిగా సహజసిద్ధంగా పండించడమే కాకుండా అదే రీతిలో వాటిని మాగబెడుతున్నాడు. ఈ రకమైన పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తాను తింటున్న ఆహారం ఏ రైతు ఎక్కడ పండిస్తున్నాడో వినియోగదారుడికి తెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన నేరుగా వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇందుకు సాంకేతికతను సాయంగా తీసుకున్నాడు. ఎంటెక్ చదివి ఏడేళ్లు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన ఆయన పాత పరిచయాలను ఆసరాగా చేసుకొని “ఫామ్ టు హోమ్” ను అమలు చేస్తున్నాడు. బెంగుళూరులో 34 గేటెడ్ కమ్యూనిటీ కాలనీలను ఎంపిక చేసుకొని వాటి నిర్వాహకుల సాయంతో వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయించి ఆన్ లైన్ లో ఆర్దర్లు వచ్చే ఏర్పాటు చేసుకొని జీపీఎస్ సాయంతో అడ్రస్ ల ప్రకారంగా వారి ఇండ్ల వద్దకెళ్లి పండ్లను అందజేస్తున్నాడు. లావాదేవీలు కూడా ఆన్ లైన్ లోనే కొనసాగిస్తాడు. వినియోగదారులు కోరిన రకాలను 3,5,10 కేజీల బాక్సుల్లో పండ్లను నింపి వాహనంలో తానే నేరుగా బెంగుళూరుకు తీసుకెళ్లి అందజేస్తున్నాడు. ఇటీవలే మొదలు పెట్టిన ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికి 1200 ఆర్దర్లకు సంబంధించి 5 టన్నుల మామిడిపండ్లను సరఫరా చేసినట్లు ఆయన చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆర్దర్లు వస్తున్నప్పటికీ కర్ణాటకలో విస్తరిస్తున్న కోవిడ్ కారణంగా ఆగిపోయినట్లు తెలిపారు.
తలకంటి ఫామ్స్ పేరిట వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
Leave Your Comments