వార్తలు

రాష్ట్రంలో కందికి డిమాండ్..

0

తెలంగాణ రాష్ట్రంలో కంది పంట ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నెల ప్రారంభంలో క్వింటాలు కందికి రూ. 5936 మించి ధర పెట్టని వ్యాపారులు ఇప్పుడు అదే కంది పంటను పోటీలు పడి కొంటున్నారు. సోమవారం మార్కెట్లో కంది పంట ధర రూ. 7100 దాటేసింది. రైతులనుంచి కంది పంట మార్కెట్ కు రావడం తగ్గిపోవటంతో ఇక సరుకు దొరుకుతుందో లేదో అన్నఆందోళన కూడా పంట కొనుగోలు దారుల మధ్య పోటీని పెంచుతోంది. గత నెల్లో క్వింటాలు కంది రూ. 5000కు కూడా కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు ధరలు పెరగకుండా అదిమిపెడుతూ వచ్చారు. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు మార్క్ ఫెడ్ కేంద్రాల వైపు ఎదురు చూశారు.

కంది కొనుగోలులో మార్క్ ఫెడ్ గత నెల రోజులుగా ఊగిసలాడుతూ వచ్చింది. కందులు కొనాల వద్దా అన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు నిరాశ చెందుతూ వచ్చారు. అయితే అకాల వర్షాలు చీడపీడలతో దేశ వ్యాప్తంగా కంది పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. కేంద్ర వ్యవసాయశాఖ వర్గాల అంచనా మేరకు ఖరీఫ్ లో 3.68 మిలియన్ టన్నుల కంది పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, అకాల వర్షాలు పంట దిగుబడి లక్ష్యాలను దెబ్బతీశాయి. సాధారణంగా మధ్యప్రదేశ్ లో కంది పంట అధికంగా సాగుచేస్తారు. అక్కడ కూడా అకాల వర్షాలు ఈ సారి కంది పంట దిగుబడి అంచనాలకు బ్రేకులు వేశాయని కేంద్ర వ్యవసాయశాఖ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా కంది పంట దిగుబడి తగ్గటంతో కంది పంటకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వానాకాలం 8 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. జనవరి తొలివారం నుంచే పంట నూర్పిళ్ళు ప్రారంభమయ్యాయి. అననుకూల పరిస్థితుల్లో కూడా ఎకరానికి 6 క్వింటాళ్లకు పైగానే దిగుబడి లభిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మార్క్ ఫెడ్ అధికారులు రాష్ట్రంలో వానాకాలం పంట దిగుబడిని 5 లక్షల టన్నుల మేరకు అంచనా వేశారు.

కంది కొనుగోలుకు రూ. 1360 కోట్లు సిద్ధం రాష్ట్రంలో రైతుల నుంచి కంది పంట కొనుగోలుకు మార్క్ ఫెడ్ కు రూ. 1360 కోట్లు అందచేసింది. రాష్ట్రంలో కంది మద్దతు ధరల కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో రైతుల నుంచి కనీస మద్ధతు ధరలకు పంటను కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 70 చోట్ల పంట కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నాఫెడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం కోటాగా 77000 టన్నుల కందులు కొనుగోలుకు అనుమతి తెలిపింది. మార్క్ ఫెడ్ కూడా మరో 22 వేల టన్నుల కందులను కొనుగోలు చేయాలని  ప్రణాళిక రూపొందించింది.

రైతుల నుంచి కంది పంట కొనుగోలుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు మార్క్ ఫెడ్ ఛైర్మన్ మారే గంగారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కందిపంటకు ఈ ఏడాది మద్ధతు ధరలు క్వింటాలుకు రూ. 6000 ప్రకటించింది. అయితే మార్కెట్ లో కంది పంటకు డిమాండ్ పెరగటంతో మద్దతు ధరకంటే వెయ్యి రూపాయలు పైగానే అదనంగా ధర లభిస్తోంది. ఈ నెల ప్రారంభంలో క్వింటాలు ధర రూ. 5936 ఉన్న ధరలు క్రమేపి రోజుకు రెండు మూడు వందల రూపాయల వంతున పెరుగుతూ వస్తున్నాయి.  సోమవారం ఏకంగా రూ. 7100 ధర పలికింది. కంది కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి కంది ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Leave Your Comments

పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలి అనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సినవి..

Previous article

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..

Next article

You may also like