Crop Suggestion Using Weather Analysis: ఈ ఖరీఫ్ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎంతో వ్యత్యాసంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమలో భిన్నమైన పరిస్థితులున్నాయి. జూలైలో అధిక వర్షాలకు పంటలకు కొంత నష్టం జరిగింది. ఆగష్టులో రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమలో వేరుశనగ సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 60% మాత్రమే విత్తడం జరిగింది. ఉత్తరాంధ్రలో చెరువుల కింద సాగు చేసే వరి విస్తీర్ణం తగ్గింది. చాలా చోట్ల ఇంకా నాట్లు పడలేదు. పత్తి, అపరాలు, వర్షాధార చెరకు వంటివి పంటలు బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వివిధ పంటల పరిస్థితి విశ్లేషణ చేస్తూ రైతులకు కొన్ని సూచనలు వివరించడం జరిగింది.
వరి :
జూలై, ఆగస్టు మాసాల్లో నాట్లు వేసిన వరిపై పిలకలు తొడిగే దశలో ఉంది. సిఫార్సు చేసిన నత్రజని మోతాదు ఎకరాకు 25 కిలోల యూరియా వేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత గాలిలో తేమ ఉన్న పరిస్థితుల్లో (కోస్తా ప్రాంతాల్లో) రసం పీల్చే పురుగు ఉధృతి పెరగవచ్చు. అవసరాన్ని బట్టి క్లోరోపైరిఫాస్ (లీటరు నీటికి 2.5 మి.లీ. చొప్పున) లేదా మోనోక్రోటోఫాస్ (లీటరు నీటికి 1.6 మి.లీ. చొప్పున) పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాట్లు వేసే పరిస్థితి ఉంటే ముదురు నారు దగ్గరగా నాటాలి. (చ. మీ. 33 మొనలు) మరియు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదుకు 25 శాతం అధికంగా వాడాలి. నారు అందుబాటు లేని పరిస్థితుల్లో తేలికపాటి వరి రకాలను 120 రోజులు పంట కాలం కలిగినవి మొలకెత్తించిన విత్తనాలు దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తుకోవాలి లేదా డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తాలి. వర్షాలు ఇంకా ఆలస్యమై వరి పైరు వేయలేని పరిస్థితుల్లో రాగి, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.
చెరకు :
మే, జూన్ మాసాల్లో నాటిన చెరుకు పైరుకు బోదెలు, కాలువలు సరిచేసి మొదటి దఫా నత్రజని ఎరువు సిఫార్సు చేసిన మోతాదులో సగ భాగం వేసుకోవాలి. బెట్ట పరిస్థితి ఉంటే ఎకరాకు నాలుగు టన్నుల చెరుకు చెత్తను మల్చింగ్‌గా వేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి చెరుకు తోటల్లో చదలు గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ మందు లీటరు నీటికి ఐదు మి.లీ. చొప్పున కలిపి గడలు, మొదళ్ళు తడిచేటట్లు పిచికారి చేయాలి.
వేరుశనగ :
రాయలసీమ జిల్లాల్లో ఉన్న బెట్ట పరిస్థితుల వలన వేరుశనగ విస్తీర్ణం 30 శాతం మేర తగ్గింది. విత్తన వేరుశనగ పంట కొన్ని ప్రాంతాల్లో బెట్టకు గురైంది. బెట్ట పరిస్థితుల్లో పైరును కాపాడుకోవడానికి పొడి సున్నం లీటరు నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరు పై పిచికారీ చేస్తే మొక్కల ద్వారా ఆవిరయ్యే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియా ఎరువు కలిపిన ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయాలి. బాగా ఆలస్యమైన వేరుశెనగ పైరు వేయలేని భూముల్లో ఉలవ పంటను విత్తుకోవచ్చు.
Also Read: షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచే పోషకాల గని “స్కై ఫ్రూట్”
పత్తి :
తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరును విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆగస్టు రెండో పక్షంలో నెలకొన్న బెట్ట పరిస్థితుల వల్ల ప్రత్తి పైరు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీని నివారించడానికి లీటరు నీటికి 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ మరియు 20 గ్రాముల యూరియా చొప్పున కలిపిన ఎరువు ద్రావణాన్ని మార్చి, మార్చి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అధిక బెట్ట పరిస్థితుల్లో పండాకు తెగులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 20 గ్రాముల యూరియా కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలకు రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు పైరు మధ్యలో అక్కడక్కడా ఏర్పాటు చేస్తే తెల్ల దోమలు ఆకర్షింపబడి జిగురుకు అతుక్కుంటాయి. ప్రత్యామ్నాయంగా ఇమిడా క్లోప్రిడ్ మందు మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి పత్తి మొక్కల కాండంపై బ్రష్‌తో పూస్తే రసం పీల్చే పురుగులు నియంత్రించబడతాయి.
మొక్కజొన్న :
ఖరీఫ్ మొక్కజొన్న జల్లుపొడిచే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. అవసరాన్ని బట్టి ఒక తడి ఇచ్చి సిఫార్సు చేసిన (1/3వ వంతు) మోతాదు నత్రజని ఎరువు ఇవ్వాలి. (60 కిలోల యూరియా) నత్రజని ఎరువు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. కత్తెర పురుగు ఆశిస్తే సరైన నివారణ సూచనలు పాటించాలి. ముఖ్యంగా లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయాలి. ట్రైకో గ్రామ బదనికల కార్డులు ఎకరాకు 6 నుంచి 8 చొప్పున పెట్టాలి గుడ్లను గమనించిన వెంటనే ఎకరాకు ఒక లీటరు వేప నూనె లేదా ఐదు శాతం వేప గింజల కషాయం పిచికారీ చేయాలి ఈ పురుగు తొలి దశను నివారించడానికి ఎకరానికి 500 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 మి.లీటర్ల క్వినాల్ ఫాస్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పెసర, మినుము :
నీటి ఎద్దడి నుండి పైరును కాపాడడానికి రెండు శాతం యూరియా లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణం పిచికారీ చేయాలి. ఆకు ముడత మరియు రసం పీల్చుపురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి 2.5 మి.లీ. కలిపిన మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
జావ, బొప్పాయి మరియు దానిమ్మ :
నీటి ఎద్దడి వలన పిండి నల్లి రసం పీల్చుపురుగులు ఉదృతి పెరుగుతుంది. లీటరు నీటికి రెండు మి.లీ చొప్పున కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.
కొన్ని ముఖ్య సూచనలు :
. ఎరువులు వేసే ముందు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూడాలి. లేదా 20 నుండి 25 లీటర్లు వర్షం కురిసిన తరువాత మాత్రమే పైరుకు ఎరువు వేయాలి.
. ఆకాశం మేఘావృతంగా ఉండి వర్ష సూచన ఉంటే క్రిమిసంహారక మందులు పిచికారి వాయిదా వేయాలి.
. బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పంట వయసును బట్టి రెండు శాతం యూరియా గ్రామం డిఏపి పొటాషియం నైట్రేట్ లాంటి పోషక ఎరుగు ద్రావణాన్ని రెండు నుండి మూడు రకాలుగా పిచికారీ చేయాలి.
. మొక్కజొన్నలో జల్లు, పీచు దశలో నీటి ఎద్దడి ఉంటే నీరు కట్టాలి.
. పత్తి పంట పూత నుంచి కాయ పెరిగే వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. బెట్ట పరిస్థితి ఉంటే రెండు శాతం యూరియా ద్రావణం 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అధిక వర్షాలు ఉంటే పొలం నుండి నీటిని తీసివేసి కాపర్ ఆక్సిక్లోరైడ్ మొక్క మొదట్లో తడిచేటట్లు పిచికారి చేయాలి. లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని ఆకులు తడిచేటట్లు పిచికారి చేయాలి. ఎకరాకు 30 కిలోల యూరియా G 15 కిలోల పొటాష్ ఎరువులు, మొక్క మొదలుకు మూడు ఇంచల దూరంలో వేసి మట్టితో కప్పాలి.
. అపరాల పంటలో పూత కాత దశల్లో బెట్ట ఉంటే రెండు శాతం యూరియా ద్రావణం పిచికారీ చేయాలి. అధిక వర్షాలకు పొలంలో నీటి నిల్వ లేకుండా మురుగునీరు పోయే ఏర్పాటు చేసుకోవాలి.
. వేరుశనగ పైరులో బెట్ట పరిస్థితి ఉంటే రెండు శాతం పొటాషియం నైట్రేట్ ఎరువు ద్రావణం పిచికారీ చేయాలి. పైరు 40 రోజుల వయసు ఉన్నప్పుడు ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువు వేసి మట్టిని మొక్కల మొదలకు ఎగదోయాలి.
. వాతావరణం అధిక ఉష్ణోగ్రత గాలిలో తేమ అధికంగా ఉండి ఉక్క పోత వాతావరణ ఉంటే పైర్లలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. నివారణ మార్గాలైన జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు ఏర్పాటు చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 1.60 లీటర్లు కలిపిన మందు ద్రావణం పిచికారీ చేయాలి.
. అధిక వర్షాలు కురిస్తే అపరాలు, పత్తి, సూర్యకాంతం వంటి పంటలకు ఎండు తెగులు సోకే అవకాశం ఎక్కువ కనుక పొలంలో మురుగునీటి వసతి ఏర్పాటు చేయాలి. అధిక వర్షాలు తగ్గిన తరువాత కాపర్ ఆక్సి క్లోరైడ్ మందు ద్రావణం మొక్కల మొదలు తడిచేటట్లు పిచికారి చేయాలి.
Also Read: పెరుగుతున్న గోధుమల ధరలని నియంత్రించడని ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు..