KCR Seeks Appointment With PM Modi తెలంగాణ యాసంగి పంట కొనుగోలు అంశంలో భాగంగా సీఎం కేసీఆర్ ఢీల్లీ పర్యటన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర పెద్దలతో తేల్చుకుంటానని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అయితే డిల్లీ వెళ్లిన కేసీఆర్ బృందానికి ఇప్పటివరకు పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అమెరికా వర్తక ప్రతినిధుల సమావేశంలో తలమునకలై ఉండడంతో సోమవారం రాత్రి దాక ఆయనతో భేటీ సాధ్యం కాలేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జోధ్పూర్కు బయల్దేరి వెళ్లారు.
కాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అధికారి సోమేశ్ కుమార్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంషు పాండేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ సర్కారుకు చేదు అనుభవం ఎదురైంది. కేంద్రం ముందు నుండి ప్రతిపాదించినటువంటి ఉప్పుడు బియ్యాన్ని కొనే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ అధికారులు. అయితే ముడి బియ్యం కొనుగోలు పెంపుని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి న్యాయ సలహా కోసం పంపామని.. అక్కడినుంచి అభిప్రాయం వచ్చేదాక ఆగాల్సిందేనని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. Telangana Paddy Procurement Issue
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భేటీ సంగతి దేవుడెరుగు, తెలంగాణ రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. చేతికంది వచ్చిన పంట కొనుగోలు కేంద్రాల్లో పడి ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎవ్వరూ కొనుగోలు చెయ్యకపోతే పరిస్థితేంటన్న అభద్రతాభావం రైతుల్లో మొదలైంది. కేంద్రం మెడలు వంచైనా ..ధాన్యం కొనిపిస్తామన్న తెలంగాణ సర్కార్ ప్రస్తుతం కేంద్రంతో చర్చలకు ఢీల్లి వెళ్ళింది. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ విషయంలో తగ్గేలా లేరని స్పష్టం అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనన్న టెన్షన్ రైతన్నలకు మొదలైంది. cm kcr delhi tour updates