ఔషధ మొక్కలతోనూ, పూల మొక్కలతోనూ రకరకాల పార్కుల్ని ఏర్పాటు చేయడం చూశాం. అయితే మొక్కల్లో పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల కోసం ప్రత్యేకంగా ఒక పార్కును ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ లో. మనదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి “పాలినేటర్ పార్క్” ఇదే. పంటల నుంచి పండ్ల చెట్ల వరకూ ఈ భూమ్మీద ఉన్న దాదాపు తొంభైశాతం మొక్కలకు పరాగ సంపర్కం జరిగి అవి వృద్ధి చెందాలంటే తేనెటీగలూ సీతాకోకచిలుకలూ చిన్న చిన్న పక్షులూ మరెన్నో కీటకాలూ సాయపడాల్సిందే. కానీ రకరకాల కారణాల వల్ల వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. తేనెటీగలు అంతరించిపోయే ప్రమాదం పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఉత్తరఖండ్ అటవీ శాఖ నైనిటాల్ జిల్లాలోని హల్ ధ్వని నగరంలో ఈ పార్కును ఏర్పాటు చేసింది. ఇందులో ఎన్నో రకాల సీతాకోకచిలుకలూ తేనెటీగలూ పక్షులూ కీటకాలను ఆకర్షించే పూల మొక్కలూ పండ్ల చెట్లూ ఉంటాయి. వాటిని ఎవరూ కోసుకోరు. ఆ పువ్వుల మకరందాన్ని ఆస్వాదించి అవి అక్కడే గూడుకట్టుకుని ఉండేలా ఆ పరిసరాలను తీర్చిదిద్దారు నిపుణులు. ఆ వాతావరణం వాటికి సహజంగా ఉండడంకోసం రాలిపోయిన ఆకుల్నీ ఎండిపోయిన మొక్కల్ని అలాగే ఉంచేస్తారు. కొన్ని కీటకాలు నీటిలో గుడ్లు పెడతాయి కాబట్టి మధ్యలో అక్కడక్కడా చిన్న చిన్న కుంటల్ని తవ్వించారు. ఆ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ ఎలాంటి రసాయనాలు, క్రిమిసంహారకాలూ వాడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వన్య మృగాలకు అభయారణ్యాల లాగా కీటకాల రక్షణకు ఈ పాలినేటర్ పార్క్ అన్నమాట.