ఉద్యానశోభ

పార్థీనియం కలుపు మొక్కలను అరికట్టే చర్యలు..

0

పార్థీనియం ( వయ్యారిభామ) కలుపు మొక్కల్లో అత్యంత హానికరమైన, సమస్యాత్మక కలుపు మొక్క. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి తదితర పేర్లతో పిలిచే ఈ మొక్కలతో కలిగే నష్టాలు, చేపట్టాల్సిన నివారణ చర్యలను తెలుసుకుందాం. వయ్యారిభామ కలుపు మొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినది. దిగుమతి అయిన గోధుమల ద్వారా 1950 వ దశకంలో మన దేశంలో ప్రవేశించి కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా విస్తరించింది. మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది చాలా విస్తరంగా కనిపిస్తుంది. పంటపొలాల్లో, బంజరు భూముల్లో, జనావాసాల్లో, రోడ్ల పక్కన, రైల్వే ట్రక్కుల పక్కన, కాల్వగట్ల మీద,పొలం గట్ల మీద, సేద్యం చేయని పొలాల్లో, బస్టాప్ ల చుట్టూ, పాడుబడిన ప్రదేశాల్లో పెరుగుతుంది.
పార్థీనియం మొక్క మనుషులకు, జంతువులకు, పంట మొక్కలకు హాని కలిగిస్తుంది. పంట పొలాలలో 40 శాతం దిగుబడిని, పశుగ్రాస పంటల్లో 90 శాతం దిగుబడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్లనుంచి వెలువడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కలను పెరగనీయవు. పంట దిగుబడులను తగ్గిస్తాయి. పార్థీనియం ఉత్పత్తి చేసే పుప్పొడి టమోటో, వంగ, మిరప, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. ఈ కలుపుమొక్క ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ లక్షణాలు కలిగి ఉండటం వలన పైరు మొక్కలకంటే ఎక్కువ మనుగడశక్తి కలిగి పైరు మొక్కలతో పోటీపడి పంట దిగుబడిని తగ్గిస్తుంది. పార్థీనియం కొన్ని రకాల వైరస్ లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కల్లో వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. మనుషుల్లో డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం, బ్రంఖైటీస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. రైతులు సాధారణంగా పార్థీనియం ను చేతితో పీకివేస్తుంటారు. కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించినప్పుడు ఈ పద్ధతి సాధ్యంకాదు. పార్థీనియంను పూతకు రాకముందే పీకి తగులబెట్టాలి లేదా కంపోస్ట్ తయారీలో వినియోగించాలి. పూతకు వచ్చిన తరువాత పీకినట్టయితే వెంటనే పీకిన మొక్కలను తగులబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి. పార్థీనియం వల్ల ఎలర్జీ కలగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి లేదా చేతులకు తొడుగులను ధరించి పీకివేయాలి. పంట మార్పిడి పాటించాలి. బంతితో పంటమార్పిడి చేస్తే తర్వాత వేసే పైరులో పార్టీనియం ఉధృతి తక్కువగా ఉంటుంది.
రసాయనిక పద్ధతి ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలం. అంతే కాకుండా రసాయనాలు వాడటం వలన పరిసరాల కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రసాయన కలుపునాశక మందులను దూరంగా ఉంచాలి. లేదా తక్కువ మోతాదులో వాడాలి. రోడ్ల పక్కన, ఇంటి చుట్టుపక్కల పార్థీనియం నివారణకు 5 గ్రాముల అట్రజిన్ ను ఒక లీటరు నీటికి కలిపి కలుపు మొక్కలు మొలకెత్తక ముందు పిచికారీ చేయాలి. మొలకెత్తిన 15 – 20 రోజులకు గ్లైఫొసేట్ 10 మి.లీ. ఒక లీటరు నీటికి లేదా పారాక్వాట్ 5 – 7 మి.లీ. మందును ఒక లీటరు నీటికి వంతున కలిపి కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేయాలి. వేసవి దుక్కులతో చాలా వరకు కలుపుమొక్కలు నశిస్తాయి.

Leave Your Comments

క్యారెట్ రైతు విజయగాధ..

Previous article

రావిచెట్టు బెరడుతో శ్వాస సమస్యలను అరికట్టవచ్చు..

Next article

You may also like