తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరిసాగు గణనీయంగా పెరిగింది. వానాకాలం, యాసంగిలో కలిపి సుమారుగా కోటి ఎకరాలలో వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరిపంట చాలాచోట్ల గింజ తయారయ్యే దశనుంచి కోతదశలో ఉంది. కొన్ని చోట్ల తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి అన్ని గ్రామాల్లో, ప్రభుత్వ గురుకులాల్లో సన్న బియ్యం అందజేసే ఉద్దేశంతో వరిలో సన్నరకాల సాగు ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500/- బోనస్ రైతులకు అందిస్తున్నారు. దీని వల్ల రైతులకు సన్నరకాలకు క్వింటాకు రూ.2320/- కనీసం మద్దతు ధర, రూ.500/- బోనస్ కలిపి మొత్తం క్వింటాకు రూ. 2820 /- చెల్లిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు సన్న రకాలు, దొడ్డురకాల వ్యత్యాసం తెలియడం చాలా అవసరం.
సన్నరకాలు అని నిర్ధారించడం ఎలా?
గింజ పొడవు, వెడల్పు మరియు పొడవు వెడల్పుల నిష్పత్తుల ఆధారంగా సన్న రకాలను నిర్ధారిస్తారు. గింజ పొడవు 6 మి. మీ. కన్నా తక్కువ, గింజ వెడల్పు 2 మి. మీ. కన్నా తక్కువ, గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5 మి. మీ. కన్నా ఎక్కువగా ఉంటే సన్నరకాలుగా నిర్ధారిస్తారు. సన్నాలు ఈ ప్రమాణాలు కలిగి ఉండి సాంబా మసూరి (BPT – 5204), తెలంగాణ సోనా (ఆర్.ఎన్.ఆర్. -15048), HMT సోనా, జైశ్రీరామ్ రకాలను పోలి ఉంటాయి. డయల్ మైక్రోమీటర్ ఆధారంగా గింజ పొడవు,వెడల్పు మరియు పొడవు వెడల్పుల నిష్పత్తి లెక్కిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న సన్నధాన్యం వరి రకాల జాబితా:
రకం పంటకాలం(రోజుల్లో)
1. సిద్ది(WGL-44) 145– 150
2. కంపాసాగర్ వరి(KSP-2874) 135– 140
3. సాంబామసూరి(BPT– 5204) 150
4. జగిత్యాల వరి – 3 (JGL-27356) 130-135
5. జగిత్యాల వరి –2 (JGL–28545) 135
6. వరంగల్ సాంబా (WGL-14) 135
7. వరంగల్ సన్నాలు (WGL–32100) 135
8. జగిత్యాల మసూరి (JGL-11470) 135
9. పొలాస ప్రభ (JGL- 384) 135
10. కృష్ణ (RNR 2458) 135
11. మానేరు సోనా( JGL-3828) 135
12. తెలంగాణ సోన (RNR-15048) 125
13. వరంగల్ వరి – 1(WGL-119) 120
14. కునారం వరి -2 (KNM-1638) 125
15 వరంగల్ వరి -2 (WGL-962) 125
16. రాజేంద్రనగర్ వరి – 4 (RNR- 21278) 120
17 కునారం వరి -1 (KNM-733) 125
18 జగిత్యాల సన్నాలు (JGL-1798) 135
19. జగిత్యాల సాంబా (JGL-3844) 135
20. కరీంనగర్ సాంబ (JGL-3855) 135
21. అంజన (JGL-11118) 115
22. నెల్లురు మసూరి (NLR- 34449) 125
23. ప్రద్యుమ్న(JGL-17004) 105
24. సుగంధ సాంబ (RNR– 2465) 125
25. శోబిత(RNR- 2354) 135
26. సోమనాథ్ (WGL-347) 130- 135
27. RNR 31479 (PRC) 125
28.KPS 6251 (PRC) 120
29.JGL 33124 (PRC) 135-140
30.HMT సోనా 140
31. మారుటేరు సాంబా (MTU1224) 135
32. మారుటేరు మసూరి(MTU-1262) 155
33. MTU 1271 140
పైన పేర్కొన్న రకాలు “సన్నాలు”గా పేర్కొనడం జరిగింది. ఈ రకాల గింజ ప్రామాణికాలు నిర్దేశించేతప్పుడు వాటిల్లో తేమ శాతం 17 కి మించి ఉండరాదు.
సన్నలా….. దొడ్డు రకమా ?
సన్నరకాల గుర్తింపులో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మూడు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తుంది. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సన్నవడ్లు కావని పేర్కొంటే రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. మండలస్థాయి కమిటీలో మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు సభ్యులు ఉంటారు. ఒకవేళ రైతు సంతృప్తి చెందకపోతే రెవెన్యూ డివిజన్ కమిటీకి, అక్కడ సరైన పరిష్కారం రాకపోతే జిల్లా స్థాయి కమిటీలో అప్పీలు చేసుకోవచ్చు.
యాసంగి ఎలా సాగు చేసుకోవాలి ?
తెలంగాణ రాష్ట్రంలో గత 2 – 3 సంవత్సరాల నుంచి యాసంగి కాలంలో వేసవి వరి పంట కోత దశలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలుల వల్ల పంట నష్టం జరుగుతుంది. అందువల్ల యాసంగి వరి నారు మడులను నవంబర్ 15 – 25 మధ్యలో పోసుకున్నట్లయితే మార్చి చివరి వరకు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పంట కోతలను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా అకాల వర్షాలు, వడగండ్ల వానల నుంచి పంటలను రక్షించుకోవడానికి, నూక సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగుచేయడం వల్ల పైన పేర్కొన్న సమస్యలను అధిగమించవచ్చు.
కె. రాజేంద్రప్రసాద్, డి. సంతోష్ కుమార్, ఎ. శ్రీజన్, బి.విద్యాధర్,
ఆర్. శ్రవణ్ కుమార్, వై. హరి, డా.ఎం.బలరాం,
వ్యవసాయ కళాశాల, వరంగల్.