కరివేపాకు కదా అని తీసిపారేయలేదు ఆ రైతులు. డిమాండుకు అనుగుణంగా పంట సాగు చేశారు. చక్కని ధర పలకడంతో లాభాలు గడిస్తున్నారు. ధర్మవరం మండలం ఉప్పనేసినపల్లికి చెందిన యువ రైతు శంకరయ్య ఆరునెలల కిందట రెండు ఎకరాల్లో కరివేపాకు సాగు చేపట్టారు. ఏటా బోరు, బావుల కింద వేరుశనగ, ఇతర పంటలు సాగు చేసి నష్టాలు చవిచూసిన మరి కొంతమంది రైతులు కూడా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపారు. ఆశించిన దిగుబడితో పాటు కూలీల ఖర్చు తక్కువగా ఉండటంతో లాభాలబాటలో నడుస్తున్నారు. ఉప్పనేసినపల్లికి చెందిన నాగలక్ష్మి,శంకరయ్య, నాగభూషణ్ అనే రైతులు ఐదు ఎకరాల్లో కరివేపాకు పంటను సాగు చేశారు. ఎకరాకు రూ. 50 వేలు చొప్పున పెట్టుబడి పెట్టారు. నాటిన అనంతరం ఆరు మాసాలకు కోతకు వచ్చింది. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి సాధించారు. ఫిబ్రవరి లో మార్కెట్లో టన్ను ధర రూ. 55 వేల నుంచి రూ. 60 వేల వరకు పలకడంతో మంచి లాభాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం టన్ను ధర రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉందని తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.
కరివేపాకు సాగు చెసినప్పుడు ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి. ఆరు మాసాలకు మొదటి కోత వస్తుంది. కోత కోసి కరివేపాకు కాండాలకు సేంద్రియ ఎరువులు చల్లాలి. దీంతో పంట ఏపుగా పెరుగుతుంది. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకోసారి కోత వస్తుంది. ఇలా పది నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంటుంది.
కరివేపాకు పంట సాగుతో లాభాలు గడిస్తున్న రైతులు..
Leave Your Comments