ఎండలు మంచికే అంటున్నారు వాతావరణ నిపుణులు. నిప్పులు కురిసే ఎండలు, వడగాలుల వలన మంచి ఏంటా.. అని ఆలోచన రావడం సహజమే. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటూ వడగాల్పులు వీచిన సంవత్సరంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఎంతో సానుకూలంగా వుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. అందుకే వేసవి తాపం వల్ల అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాలు సీజనుకు ముందస్తుగా వచ్చే ఎండలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. మరోవైపు ఏటా పసిఫిక్ మహాసముద్రంలో లానినా, ఎల్ నినో పరిస్థితులేర్పడుతుంటాయి. లానినా పరిస్థితులుంటే ఆ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటూ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంచడానికి దోహదపడతాయి. అలాగే ఎల్ నినో పరిస్థితులేర్పడితే ఆ సంవత్సరం వేసవి తాపం అంతగా కానీ వర్షాలు సమృద్ధిగా దారితీస్తుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులున్నాయి. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇలా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల ఋతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు దోహదపడతాయి. ప్రస్తుతం మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 – 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల వడగాల్పులు, కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. వేసవి ఆరంభానికి ముందే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మరో వైపు మే నెలల్లో ఉత్తర, తూర్పు మధ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తాజా నివేదికలో తెలిపింది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒకింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సీజన్ లో అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో నైరుతి ఋతుపవనాలకు సానుకూలమని ఐఎండీ తెలిపారు.