Different Types of Water Soil: సమస్త జీవరాశులకు నీరే ప్రాణాధారం, జీవుల శరీరాల్లో 70-90% వరకు నీరు ఉంటుంది. మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిలో చాలా తక్కువ శాతం మాత్రమే మొక్కల జీవనానికి వాడుకుంటాయి. మిగిలిన నీరు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా ఆకుల నుండి ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తుంది. ఎండ, వెలుతురు, గాలివేగం ఎక్కువగాను గాలిలో తేమశాతం తక్కువగా ఉన్నప్పుడు బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది. దీని వల్ల నేలలోని తేమ త్వరగా ఆవిరి అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో నీరు పంటలకు తరచుగా ఇవ్వాల్సి వస్తుంది. నేలలో నీటి మోతాదు మించి నీరు ఎక్కువగా ఇవ్వటం అంతే ప్రమాదం కనుక నేలలో నీరు మరీ ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూడాలి.
నేలలో లభించే నీటి రకాలు : వర్షం కురిసినప్పుడు, నేలకు సాగు నీరు పారించనప్పుడు, నీరు నేలలో ఇంకి సంతృప్తమవుతుంది. అప్పుడు మట్టి రేణువుల చుట్టూ కొంత నీరు భూమ్యాకర్షణ శక్తిని తట్టుకొని నిలిచిపోతంది. అలా నిలిచిన నీటి పరిమాణాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటారు. కొంత నీరు భూమ్యాకర్షణ శక్తి ప్రభావంతో నేల లోపలి పొరల్లోకి జారిపోతుంది. దీనిని గ్రావిటేషన్ వాటర్ అంటారు. నేలలో నిలిచిన నీరు మొక్కలు పీల్చుకోవటానికి అనువుగా ఉంటుంది. నేల పై పొరల్లోని నీరు తగ్గిపోయే కొద్ది పొరలలో నీరు మట్టి రేణువుల మధ్య ఉండే (సన్నని ఖాళీలు) సూక్ష్మనాళికల నుండి పైకి వస్తుంది. దీనిని క్యాపిల్లరీ వాటర్ అంటారు. నేలలోని తేమ బాగం తగ్గిపోయినపుడు మట్టి రేణువుల చుట్టూ చాలా పలుచని పొరగా మాత్రమే నీరు అంటుకొని ఉంటుంది. ఈ నీటిని హైగ్రోస్కోపిక్ వాటర్ అంటారు.
ఈ నీటిని మొక్కలు పీల్చుకోలేవు. ఈ నీటి అణువులు మట్టి రేణువులకు చాలా శక్తితో అంటుకొని ఉంటాయి. క్యాపిల్లరీ వాటర్ మాత్రమే మొక్కలకు అందుబాటులో ఉంటుంది. నేలలోని నీరు హైగ్రోస్కోపిక్ వాటర్ స్థాయికి పడిపోయినపుడు మొక్కలు నీరు పీల్చుకోలేక ఆకులు వాడిపోతాయి. దీనిని సాధారణ వడలుస్థితి అంటారు. ఈ స్థితిలో మొక్కలు కొంతసమయం (మొక్క రకాన్ని బట్టి కొన్ని రోజులు) ఉంటాయి. ఈ స్థితిలో మొక్కకు నీరు ఇచ్చినట్లయితే తిరిగి మొక్కలు మళ్ళీ జీవించేస్థాయిలోకి వస్తుంది. మొక్క సాధారణ వడలుస్థితి మరికొన్ని రోజుల పాటు ఉంటే, నీరు ఇచినప్పటికీ మొక్క బ్రతకని స్థితికి చేరుకుంటుంది. దీనిని శాశ్వత వడలు స్థితి అంటారు.
Also Read: Soil Acid Neutralizer: నేలల్లో రకాలు, యాసిడిక్, క్షారత్వపు నేలలను న్యూట్రల్ నేలలుగా మార్చడం ఎలా?
నేలలో సేంద్రీయ పదార్థ పరిమాణం : నేల ఎంత ఎక్కువ పరిమాణంలో సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా నీరును పట్టి ఉంచుతుంది. తక్కువగా ఉంటే నీరు త్వరగా క్రింది పొరల్లో ఇంకి పోతుంది. అందుకే సేంద్రీయ పదార్థం నేలలో ఎక్కువగా ఉంటే తక్కువ సాగు నీటితో మొక్కలు బాగా పెరుగుతాయి.
తేమను సంరక్షించే పద్ధతులు : నేలను ఎండు గడ్డితో కప్పుట లేదా పాలిథీన్ షీటు పరచడం. కలుపు మొక్కలు లేకుండా చేయడం వల్ల నీటి అవసరం తగ్గుతుంది. పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేపడితే నీటి అవసరం పెరుగుతుంది.
వాతావరణ పరిస్థితులు : వర్షాకాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉండదు. శీతాకాలంలో వర్షాలుండవు కాబట్టి నీటి అవసరం పెరుగుతుంది. వేసవిలో అధిక వేడి, గాలిలో తేమ తక్కువగా ఉండటం వలన సాగునీరు ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది.
నేల స్వభావం : నేలలోని మట్టి రేణువులు చిన్నవిగా ఉంటే ఎక్కువ నీరు నిలుస్తుంది. మట్టి రేణువులు పెద్దవిగా ఉంటే నీరు త్వరగా క్రింది పొరల్లోకి జారిపోతుంది. కనుక చెల్కా, ఇసుక భూములలో నీరు తరచుగా ఇస్తూ ఉండాలి.
మొక్క పెరిగే దశ : మొక్క పెరిగే దశలో నీటి అవసరం మారుతుంది. మొక్క క్రొత్తగా పొలంలో నటినప్పుడు పెరిగే దశలో, పూత, పిందె , కాయవృద్ధి అవుతున్న దశలలో నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. మొక్క పెరుగుదలలో ఒక గ్రాము పదార్థం తయారీకి ఎన్ని లీటర్ల నీటిని వాడుకుంటుంది.
మొక్కలకు నీటి అవసరాన్ని గుర్తించటానికి గమనించవలసిన విషయాలు: మొక్కల ఆకులు వడలినట్లు కనపడితే, ఆకుల పరిమాణం తగ్గడం, పెరుగుదల తగ్గి, పూత పిందె ఎక్కువగా రాలి పోవడం. తోటలో 6-12 ఇంచులలోపు మట్టిని తీసుకొని గట్టిగా కీళ్ళ మధ్య నొక్కితే మట్టి ముద్దగా ఉండకుండా, పొడిలా రాలిపోతే నీరు ఇవ్వాలి. శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోవాలంటే ఇర్రో మీటరు, టెన్షియో మీటరు, ఇన్ఫ్రారెడ్ ప్రాబ్ లాంటి పరికరాలు వాడాలి.
నేలలో ఇంకిన వర్షపు నీరు క్రమంగా 5 విధాలుగా తరిగి పోతుంది:
1. వర్షాకాలంలో నీరు పల్లానికి పారుతుంది. దీనిని రన్ ఆఫ్ అంటారు.
2. కొంత నీరు నేల లోపలి పొరల్లో క్రిందికి ఇంకి పోతుంది. దీనిని ఇన్ఫెల్ ట్రేషన్ అంటారు.
3. కొంత నీరు నేలలోపలి పొరల్లోకి సమాంతరంగా వ్యాపిస్తుంది. దీని సీపేజ్ అంటారు.
4. నేలలో ఉన్న నీరు నేల ఉపరితలం నుండి ఆవిరి అయిపోతుంది. దీనిని ఇవాపొరేషన్ అంటారు.
5. మొక్క తీసుకున్న నీరు కొంత ఆకుల ద్వారా బయటకు రావటాన్ని బాష్పోత్సేకం అంటారు.
ఈ మధ్య కాలంలో నీటికొరత అనేదిఎక్కువగా కనపడుతుంది. కనుక మనం సక్రమమైన నీటి పారుదల పద్ధతులను పాటించినట్లయితే ఉన్న నీరును సద్వినియోగం చేసుకొని, నీటిని ఎక్కువ వాడకాన్ని అరికట్టవచ్చు.
Also Read: Bengal Gram Cultivation: ఈ పంటను సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది…