Vermiwash: వర్మీవాష్ అనేది వానపాములు అధికంగా ఉండే మాధ్యమంలో వర్మీ కంపోస్ట్ నుండి ఉత్పత్తి చేయబడిన ద్రవసారం. ఇది అధిక స్థాయిలో డీకంపోజర్ బ్యాక్టీరియా, శ్లేష్మం, విటమిన్లు, వివిధ జీవ ఖనిజాలు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, వివిధ యాంటీమైక్రోబియల్ పెప్టైడ్‌లు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. దీనిని పంట ఉత్పాదకతను పెంచడానికి ఎరువుగా మరియు పంటను ఆశించే చీడపీడల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో అవసరమైన యాంటీమైక్రోబియల్ మరియు యాంటీ పెస్ట్ కెమికల్ లక్షణాలు ఉంటాయి. వర్మీ కంపోస్ట్‌తో పోలిస్తే, వర్మీవాష్ మొక్కల వేర్ల చుట్టూ ఉన్న లక్ష్య ప్రాంతాన్ని త్వరగా చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
వర్మీవాష్ తయారీ :
. వర్మీవాష్ తయారీకి అవసరమైన పదార్థాలు:250 లీ. డ్రమ్ లేదా చిన్న బకెట్, కంకర, ముతక ఇసుక, గార్డెన్‌లో వాడే మట్టి, వానపాములు, పశువుల పేడ, ఎండు గడ్డి, నీరు
. ఉపయోగించే వానపాముల జాతులు : పర్యావరణ వైవిధ్యాలను తట్టుకునే రెండు రకాల వానపాముల జాతులను వాణిజ్య సరళిలో కంపోస్ట్ తయారీకి వాడతారు. అవి ఏమనగా రెడ్ విగ్లర్ – ఐసెనియా ఫోటిడా, లుంబ్రికస్ రెబెల్లస్ – రెడ్ వార్మ్
తయారీ విధానం :
ప్రక్క పటంలో చూపిన విధంగా డ్రమ్/కంటైనర్ అడుగుభాగాన కంకర లేదా విరిగిన ఇటుక ముక్కలను 10-15 సెం.మీ. ఎత్తు వరకు ఒక పొర లాగ ఏర్పాటు చేయాలి. దీనిపై ముతక ఇసుకను ఒక పొరలాగా వేసుకోవాలి. ఈ ఇసుక పొరపై 40-45 సెం.మీ మందంతో పాక్షికంగా కుళ్ళిన సేంద్రియ వ్యర్థాలను ఉంచాలి. ఈ పొరలను నీటితో తడి చేస్తూ ఉండాలి. కంటైనర్‌లో సుమారు 2000 వానపాములను వదలాలి. తర్వాత 7-10 రోజుల వరకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయాలి. 10 రోజుల తర్వాత వర్మీ వాష్ తయారవుతుంది. దిగువన రంధ్రంతో కూడిన ఒక కుండను కంటైనర్ పైభాగాన వేలాడదీయాలి, దీని ద్వారా నీరు చుక్కల రూపంలో కంటైనర్‌లో క్రమ తప్పకుండా పడుతూ ఉంటుంది. ఈ కుండను ప్రతి రోజు 4 – 5 లీటర్ల నీటితో నింపాలి. అలాగే ఇంకో కుండను కంటైనర్ అడుగు భాగం దగ్గరలో వర్మీ వాష్‌ను సేకరించడానికి అమర్చుకోవాలి. ప్రతి రోజు 3 – 4 లీటర్ల వర్మీవాష్‌ను సేకరించవచ్చు.
వర్మీ వాష్ తయారీ విధానాన్ని చూపే పటం :
వర్మీవాష్ తయారీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
. వర్మీ వాష్ యూనిట్‌ను నీడ ఉన్న ప్రాంతంలో ఉంచాలి.
. వర్మీ వాష్ యూనిట్‌ను ప్రారంభం చేసిన తర్వాత 48 గంటల పాటు క్రింద ట్యాప్‌ను తెరిచి ఉంచి, నీటిని బయటకు వెళ్లేలా చేయాలి. తద్వారా యూనిట్ లోపలి మలినాలు తొలగింపబడతాయి.
. 10 రోజుల తర్వాత యూనిట్ మంచి నాణ్యమైన వర్మీవాష్‌ను అందించడం ప్రారంభిస్తుంది.
. వర్మీ వాష్‌ను సేకరించేందుకు ట్యాప్‌ను ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలి.
. యూనిట్‌లో నీరు తగినంతగా వాడాలి. నీటిని నిదానంగా పోయాలి. తక్కువ లేదా ఎక్కువ నీరు వానపాముకి హానికరం.
. నీటిని పోసేటప్పుడు కుళ్ళని సేంద్రీయ పదార్థాన్ని కలపవద్దు.
. ఎటువంటి తాజా సేంద్రీయ పదార్థాన్ని యూనిట్‌లో వాడకూడదు. ఎందుకంటే అవి విడుదల చేసే మిథేన్ వాయువు వానపాములకు హానికరం.
. కంటైనర్‌లో నింపిన పదార్థాలను కుదించకూడదు.
. మధ్యస్థ పరిమాణం కలిగిన డ్రమ్ లేదా బకెట్‌తో 7-10 లీటర్ల వర్మీ వాష్‌ను పొందవచ్చు.
. వర్మీ వాష్‌ను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
. వర్మీ వాష్ సుమారు 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది.
వర్మీ వాష్‌లో లభించే పోషకాలు
వాడే విధానం :
. మొక్కలపై నేరుగా సేంద్రీయ ద్రవ ఎరువును ఉపయోగిస్తే, మొక్కల ద్వారా అదనపు లవణాలను గ్రహించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మొక్కలకు సరిపడా నీళ్ళు పోసి, మొక్కలు నీరు తీసుకున్నా తర్వాత, తర్వాత సేంద్రీయ ద్రవ ఎరువులు వేయాలి.
. నారుముంచడం ద్వారా – నాటడానికి ముందు నారును లేదా మొక్కలను 15`20 నిమిషాల పాటు వర్మీవాష్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
. పై పాటుగా-10 శాతం వర్మివాష్‌ను (1 లీటరు నీటికి 100 మి.లీ.), 20 శాతం వర్మీ వాష్ (1లీటరు నీటికి 200 మి.లీ) పైపాటుగా పంటలపై పిచికారీ చేసుకోవాలి. పోషకాలను కలిగిఉన్న వర్మీ వాష్ నేలను సుసంపన్నం చేస్తుంది మరియు మొక్కలకు వచ్చే వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
. డ్రిప్ ద్వారా వర్మీవాష్ వాడాలనుకుంటే ఎకరానికి పది నుంచి పదిహేను లీటర్లు వాడాలి.
. వర్మీవాష్‌ను నీటితో కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ గల నేల బాగా తడిచేలా పోసుకోవాలి. దీనివలన నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు.
. ఒక ఎకరం పండ్ల తోటలో మొక్కల ఎదుగుదలకు రెండు నుండి నాలుగు లీటర్ల వర్మీవాష్‌ను ఉపయోగించవచ్చు.
. ఆకు కూరల పంటల్లో, తొలి దశలో రెండు లీటర్ల నుంచి ప్రారంభించి తర్వాత కాలంలో మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వర్మీవాష్‌ను పిచికారీ చేసుకోవచ్చు.
Also Read: Monsoon Cultivation: వర్షాకాల సాగుకి సూచనలు.!
వ్యవసాయంలో వర్మీవాష్ ఉపయోగం వల్ల కలిగే ప్రయోజనాలు :
. ఇది పూర్తిగా సేంద్రీయ వ్యర్థాలను అధోకరణం చేయడం ద్వారా తయారైన జీవన ఎరువు మరియు పర్యావరణ అనుకూల సహజ ఎరువు. ఇది పూర్తిగా ఎటువంటి రసాయనాలు లేనిది.
. వర్మీవాష్ మొక్కలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది మరియు అనేక మొక్కల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
. 10 శాతం వర్మివాష్ (100 మి.లీ./1 లీటరు నీరు) ఒక జీవ శిలీంధ్ర నాశిని మరియు ద్రవరూప ఎరువులాగా పనిచేస్తుంది. ఇది నేల ఆకృతి మరియు నేలలో వాయు ప్రసరణ వంటి నేల యొక్క భౌతిక-రసాయన లక్షణాలను మెరుగుపరుస్తుంది. వర్మీవాష్‌లో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల నేలలో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
. ఇది మొక్కల్లో మొలకెత్తే సామర్థ్యం మరియు వేరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
. నేలలో సేంద్రియ ఎరువుగా వాడటం వలన నేల యొక్క పోషక సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు తద్వారా ఇది పంటకు సహజ ఎరువుగా పనిచేస్తుంది.
. వర్మీవాష్ మొక్కల్లో ఎదుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది మరియు పైపాటుగా కూడా పిచికారీ చేసుకోవచ్చు. మంచి ఫలితాల కోసం వర్మీవాష్‌ను మూడు నుండి నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి.
Also Read: Cashew Value Added Products: జీడిమామిడి పండుతో విలువ ఆధారిత ఉత్పత్తులు.!