శ్రీగంధం చెట్లు సిరులు కురిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా పసూరు గ్రామానికి చెందిన రైతు ఇస్తారపురెడ్డి తన పొలం గట్టుపై పెంచిన 20 చెట్లను విక్రయించగా రూ.36 లక్షల ఆదాయం వచ్చింది. సెంటు, పౌడర్, ఖరీదైన సబ్బులు ఇతర కాస్మొటిక్స్ లలో వినియోగించే శ్రీగంధం ధర కిలో రూ.10 వేల వరకు పలుకుతుంది. శ్రీగంధం ఆయిల్ కు అంతర్జాతీయ మార్కెట్ లో లక్షల్లో డిమాండ్ ఉంటుంది. ఈ మొక్కలను పొలం గట్లపైన, ఇంటి ఆవరణలో, మెత్త భూముల్లో పెంచవచ్చు. చెట్ల మధ్య అంతరపంటలను కూడా సాగుచేసుకోవచ్చు. శ్రీగంధం మొక్కలు స్వతహాగా ఆహారాన్ని తీసుకోలేవు. ఇందుకోసం సపోర్టుగా మొక్కలు నాటాలి. మొదటిఏడాది కోసం కంది, శనగ వంటి అంతరపంటలను వేస్తే వాటినుంచి శ్రీగంధం మొక్కలు ఆహారం తీసుకుంటాయి. తర్వాత ఏడాది నుంచి ఆస్ట్రేలియా టేక్, మలబార్, మామిడి తదితర మొక్కలను నాటవచ్చు. ఇవి శ్రీగంధం మొక్కలకు ఆహారాన్ని అందించడంతోపాటు, రైతుకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతాయి. 12 నుంచి 15 ఏండ్ల మధ్య శ్రీగంధం చెట్లను విక్రయించవచ్చు. శ్రీగంధం చెట్లను కట్ చేసి విక్రయించేందుకు అటవీశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.
శ్రీగంధం చెట్ల పెంపకంపై రైతులకు అవగాహనా కల్పించేందుకు ఆ మొక్కలను పెంచుతున్న ఇస్తారపురెడ్డి, రవీందర్ రెడ్డి 50 మందితో కలిసి “తెలంగాణ శ్రీగంధం రైతు పరస్పర సహకార పొదుపు సొసైటీ” ని ఏర్పాటు చేశారు ఇందులో 400 మందిని సభ్యులుగా చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రవీందర్ రెడ్డి ఓఆర్ఆర్ కు సమీపంలో 31 ఎకరాలతోపాటు జనగామ దగ్గరలో వున్న 20 ఎకరాల మామిడి తోటలో 14 వేల శ్రీగంధం మొక్కలు పెంచుతున్నారు. సపోర్టుగా ఆస్ట్రేలియా టేక్, మలబార్ వేశారు. అంతరపంటలుగా కందులు, అల్లం, జొన్న, సజ్జ, వేరుశనగ తదితర మెట్టపంటలు పండించవచ్చు. మొదటి ఏడాది కంది వేశారు. ఆరేండ్ల తర్వాత సపోర్టు మొక్కల ద్వారానూ ఆదాయం వస్తుంది. శ్రీగంధం మొక్కలను 15*15 మధ్య పెంచితే మంచి ఫలితం ఉంటుంది.
శ్రీగంధం చెట్లు పెంచడంతో .. సిరులు
Leave Your Comments